
చికిత్స పొందుతూ అంగన్‌వాడీ టీచర్ మృతి
వీర్నపల్లి(సిరిసిల్ల)/సిరిసిల్లటౌన్: రాజన్నసిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం మద్దిమల్లతండాలో ప్రమాదవశాత్తు గాయపడిన అంగన్‌వాడీ టీచర్ మాజోజు స్వరూప(52) చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందింది. స్థానికులు, గ్రామస్తులు తెలిపిన వివరాలు. మద్దిమల్ల గ్రామానికి చెందిన మాజోజు స్వరూప తండాలోని అంగన్‌వాడీ టీచర్‌గా పనిచేస్తుంది. నిత్యం అక్కడికి వెళ్లి వస్తుంటుంది. ఈనెల 8న విధులు ముగించుకొని ఇంటికి నడుచుకుంటూ వస్తుండగా బైక్‌పై ఎక్కించుకున్న వ్యక్తి మార్గమధ్యలో అఘాయిత్యానికి పాల్పడేందుకు యత్నించాడు. అతని నుంచి తప్పించుకునే క్రమంలో బండి పై నుంచి పడిపోవడంతో తీవ్రంగా గాయపడింది. గమనించిన స్థానికులు 108 వాహనంలో ఎల్లారెడ్డిపేటలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఐదు రోజులుగా చికిత్స పొందుతూ శుక్రవారం తుదిశ్వాస విడిచింది. మృతురాలి కుమారుడు విష్ణుసాగర్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై లక్ష్మణ్ తెలిపారు. అంగన్‌వాడీ టీచర్ మృతి విషయాన్ని తెలుసుకున్న కలెక్టర్ దహన సంస్కారాల కోసం రూ.20వేల చెక్కును అందజేశారు.
అఽఘాయిత్యాలు నిలువరించాలి
ఐసీడీఎస్ కార్యకర్తలపై అఽఘాయిత్యాలను ప్రభుత్వం నిలువరించాలని అంగన్‌వాడీ టీచర్స్, హెల్పర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షురాలు ఎదురుగట్ల మమత కోరారు. మద్దిమల్లతండా అంగన్‌వాడీ టీచర్ మృతికి కారకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విధుల్లో చనిపోయిన వారి కుటుంబాలను ఆదుకోవాలని కోరారు. ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి కడారి రాములు, కాంగ్రెస్ కార్యకర్త కల్లూరి చందన, అంగన్‌వాడీ టీచర్లు శాంత, సరోజన, మంజుల, అన్నపూర్ణ, వనజ, శోభ తదితరులు పాల్గొన్నారు.
కన్నీరుపెట్టుకున్న అంగన్‌వాడీలు
నిందితుడిని శిక్షించాలని డిమాండ్

చికిత్స పొందుతూ అంగన్‌వాడీ టీచర్ మృతి