
యూరియా.. మాయ!
● అన్నదాతతో వ్యాపారుల ఆటలు ● కృత్రిమ కొరత సృష్టిస్తూ.. పొటాష్ అంటగడుతూ.. ● ఆపై అధిక ధరలకు విక్రయం ● తనిఖీల్లో వెలుగు చూడకపోవడం విచిత్రం
కరీంనగర్ అర్బన్ ●:
అన్నదాతతో ఆటలాడుతున్నారు వ్యాపారులు. నిక్కచ్చిగా వ్యవహరించాల్సిన అధికారగణం నామమాత్రానికే పరిమితమవుతుండటంతో అడ్డగోలుగా దోచుకుంటున్నారు. ఎరువుల కొరత లేకుండా నిర్ణీత ధరకే రైతులకు చేరేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించగా ఆచరణలో మాత్రం పూర్తి భిన్నంగా ఉంది. అవసరం లేని ఎరువులను అంటగడుతూ రైతును పీల్చిపిప్పిచేస్తుండగా వ్యవసాయ శాఖ పట్టించుకోవడంలేదు. ఇక యూరియా కొరతతో రైతాంగం అల్లాడుతుంటే ప్రతిపక్ష పార్టీలు కిమ్మనకపోవడం ఆందోళనకర పరిణామం. ఇదిలాఉంటే వ్యవసాయ అధికారుల్లో ఒకరు తనిఖీల పేరిట వసూళ్లకు పాల్పడుతున్నారని సమాచారం. కింది నుంచి పైస్థాయి వరకంటూ ఎక్కువ మొత్తంలో డిమాండ్ చేస్తున్నారని పలువురు డీలర్లు వాపోయారు.
ఆర్గానిక్ పోటాష్‌తో ముడిపెడుతూ దోపిడీ
ఎరువులను మార్క్‌ఫెడ్ సంస్థ ద్వారా 60 శాతం, ప్రైవేటు డీలర్ల ద్వారా మరో 40 శాతం విక్రయాలు చేపట్టాలి. కాగా అధికారులు, వ్యాపారుల మధ్య లోపాయికారి ఒప్పందంతో విక్రయాల శాతం మరోరకంగా ఉందన్న ఆరోపణలున్నాయి. కరీంనగర్ పట్టణంలోని చేపల మార్కెట్, గాంధీ ఏరియాలోని పలు ఫెర్టిలైజర్ దుకాణాలతో పాటు కరీంనగర్ రూరల్, హుజూరాబాద్, జమ్మికుంట, చొప్పదండి, గంగాధర, మానకొండూరు, శంకరపట్నం, వీణవంక, చిగురుమామిడి, తిమ్మాపూర్ మండలాలతో పాటు దాదాపు జిల్లావ్యాప్తంగా యూరియా కోసం రైతులు నానాపాట్లు పడుతున్నారు. బస్తా యూరియా ధర రూ.266.50 కాగా సొసైటీల్లో కూడా ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారు. ఒక్కో బస్తాను రూ.310కి విక్రయిస్తున్నారని రైతులు వాపోతున్నారు. పలు సొసైటీలు, ప్రైవేట్ వ్యాపారులు ఇష్టారీతిగా విక్రయాలు చేస్తుండటం గమనార్హం. కృత్రిమ కొరత సృష్టిస్తూ రూ.330 నుంచి రూ.350 వరకు విక్రయిస్తున్నారు. ఇదేంటని ప్రశ్నిస్తే మరికొన్ని రోజులైతే అసలు యూరియానే దొరకదంటూ మాటల గారడీతో సొమ్ము చేసుకుంటున్నారు. యూరియా ఇవ్వాలంటే ఆర్గానిక్ పొటాష్‌ను కొనాల్సిందేనని ముడిపెడుతున్నారు. 20కిలోల బస్తా ధర రూ.1400లు కాగా దాంతో ముడిపెడుతుండటం శోచనీయం.
ఆదేశాల అమలేది?
ఎకరాకు బస్తా యూరియా మాత్రమే ఇవ్వాలని ప్రభుత్వం స్పష్టంచేయగా అంతకుమించి ఇస్తే డీలర్ల డీలర్‌షిప్ రద్దు చేస్తామని ప్రకటించింది. కానీ.. ఆచరణలో మాత్రం విరుద్ధ పరిస్థితని తెలుస్తోంది. యూరియా విక్రయాలపై నిఘాను తీవ్రతరం చేశామని వ్యవసాయ శాఖ బీరాలు పలుకుతున్నా.. ఆచరణలో మాత్రం అన్నదాతకు ఇబ్బందులు తప్పడం లేదు. కరీంనగర్, హుజూరాబాద్, మానకొండూరు, చొప్పదండి వ్యవసాయ డివిజన్లు ఉండగా సదరు స్థాయిలో ఏడీఏలు ఉన్నారు. కరీంనగర్‌లో చొప్పదండి ఏడీఏ, హుజూరాబాద్‌లో మానకొండూరు ఏడీఏ, మానకొండూరులో హుజూరాబాద్ ఏడీఏ, చొప్పదండిలో కరీంనగర్ ఏడీఏలు తనిఖీలు చేస్తుండగా యూరియా బస్తాల విక్రయాల్లో దోపిడీ వీరికి కనిపించలేదా..నన్నది అనుమానాస్పద ప్రశ్న. తనిఖీల పేరుతో స్టేటస్‌లు, గ్రూప్‌ల్లో హడావుడి తప్ప నోటీసులిచ్చిన దుకాణాలెన్ని, ఏ ఏ దుకాణాలపై చర్యలు తీసుకున్నారో..నన్నది శేషప్రశ్న. ప్రాథమిక సహకార సంఘాలు, డీసీఎంఎస్, ఆగ్రోస్ కేంద్రాలతోపాటు ప్రైవేట్ ఎరువుల దుకాణాలను వారంలో ఒక్కరోజు తనిఖీ చేస్తున్నారు. ఇటీవల కరీంనగర్ రూరల్ మండల పరిధిలోని డీలరు ఓ రైతుకు ఒకే పట్టాదారు పాసుపుస్తకంపై 50 బస్తాలను అమ్మినట్లు అధికారులు గుర్తించగా సదరు డీలర్‌పై అవ్యాజ ప్రేమ కనబర్చడం అధికారులకే చెల్లు.
బ్లాక్ మార్కెట్‌కు యూరియా
పంట ఎంత వరకు సాగైంది.. ఇప్పటివరకు ఎంత విక్రయాలు జరిగాయో ఆయా ప్రాంతాలను బట్టి పరిశీలిస్తే స్పష్టమవనుండగా ఆ దిశగా చర్యల్లేవు. మొక్కుబడిగా తనిఖీలు నిర్వహించడమే తప్ప సదరు తనిఖీలతో రైతులకు ప్రయోజనం సున్నా. యూరియా వివిధ రకాల పంటలకు వినియోగించాల్సి ఉండగా బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్నారు. పౌల్ట్రీ, డెయిరీ ఫాంలలో యూరియాను ఉపయోగిస్తున్నారు. పేరొందిన డెయిరీలు కూడా పెద్దమొత్తంలో యూరియాను నిల్వచేస్తున్నాయి. లిక్కర్‌లోనూ యూరియా విచ్చలవిడిగా వాడుతున్నారన్న ఆరోపణలున్నాయి. సదరు కంపెనీల యాజమాన్యాలు అడ్డదారిలో యూరియాను భారీ మొత్తంలో పక్కదారి పట్టిస్తున్నాయి. అయితే ఈ–పోస్ ద్వారా యూరియా విక్రయాలు జరుగుతుండగా ఎక్కువగా ఎవరు తీసుకున్నారు? సదరు రైతు సాగు చేసిన భూమి ఎంత, ఇంట్లో ఉన్నదెంతననే కోణంలో అధికారులు విచారణ చేస్తే ఆసక్తికర విషయాలు వెలుగుచూస్తాయి.
వానాకాలం సీజన్‌లో నెలల వారీగా అవసరమిలా
జిల్లాకు యూరియా అవసరం:
43,254 మెట్రిక్ టన్నులు
జిల్లాలో ఉన్న యూరియా: 24,493మె.టలు
సరిపడా యూరియా ఏది?
యూరియా రైతులకు దొరకడం లేదు. అవసరం లేని ఎరువులను అంటగడుతున్నారు. ప్రభుత్వం ముందు చూపుతో ఎరువులను సరఫరా చేయాల్సిందిపోయి వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేస్తోంది.
– గూడూరి మల్లారెడ్డి, రైతు, హూజూరాబాద్
ఎక్కువ ధరకు అమ్ముతున్రు..
యూరియా బస్తా ధర రూ.266.50 అని ప్రభుత్వం చెబుతున్నా.. వ్యాపారులు మాత్రం రూ.300లకుపైగా విక్రయిస్తున్నారు. ఇదేంటంటే మార్కెట్‌లో యూరియా లేదంటున్రు. వర్షాలు లేక ఇబ్బందిపడుతుంటే ఇదెక్కడి గోస.
– ముత్యంరెడ్డి, రైతు, కరీంనగర్ రూరల్
జూన్: 5,190 మె.ట, జూలై: 12,976
ఆగస్టు: 15,139, సెప్టెంబర్: 8,651