
ప్రభంజనం
● ఉమ్మడి జిల్లాలో రోజురోజుకు పెరుగుతున్న జనాభా
● జననాలు పెరగుతుండగా.. తగ్గుతున్న మరణాలు
● భయపెడుతున్న పట్టణీకరణ సమస్య
నేడు ప్రపంచ జనాభా దినోత్సవం
సాక్షి,పెద్దపల్లి ●:
దేశ ప్రగతికి, పతనానికి ప్రధాన కారణమైన జనాభా ఇప్పుడు ప్రపంచాన్నే భయపెడుతున్న అతిపెద్ద సమస్య. జనాభా తగ్గుదలపై ప్రభుత్వాలు ఆందోళన చెందుతుండగా, మారిన జీవనశైలితో పిల్లలను కనేందుకు ఆసక్తిచూపని దంపతుల సంఖ్య పెరుగుతోంది. ఒక్కరు ముద్దు.. ఇద్దరు హద్దు.. ఇకపై వద్దంటూ ఒకప్పుడు ప్రభుత్వాలే ముమ్మరంగా ప్రచారం చేయగా, నేడు వీలైనంత మందిని కనండని ప్రభుత్వాలే వేడుకుంటున్నాయి. ఉమ్మడి జిల్లాలో జనాభా పెరుగుదల కనిపిస్తుండగా, మరణాలు సంఖ్య గణనీయంగా తగ్గాయి. పెరిగిన జనాభా విద్య, ఉపాధి అవకాశాల కోసం పట్టణాలకు వలసపోతుండడంతో పల్లె చిన్నబోతుంది. పంట పొలాలు కనుమరుగై ఆకాశ హారామ్యలు వెలుస్తున్నాయి. కరీంగనర్, రామగుండం కార్పొరేషన్‌తో సహా జిల్లాకేంద్రాలుగా మారిన మున్సిపాలిటీలు, పంచాయతీల నుంచి మున్సిపాలిటీలుగా మారుతుండటం పట్టణాలకు వలసపోతున్న జనాభాకు నిదర్శనంగా నిలుస్తున్నాయి.
నియంత్రణతో అడ్డుకట్ట
జనాభా పెరుగుదల అభివృద్ధికి ఆటంకమన్న విషయాన్ని గుర్తించిన ప్రభుత్వం కుటుంబ నియంత్రణ కార్యక్రమాలను అమలు చేసింది. అయినా 1952 నుంచి 1975 ఎమెర్జెన్సీ కాలం వరకు విపరీతంగా పెరిగింది. ఎమర్జెన్సీ తర్వాత 1976లో ప్రకటించిన జాతీయ జనాభా విధానం అనుగుణంగా వివాహ వయస్సు పెంచడం, ఆర్థిక ప్రోత్సాహకాలు, మహిళ అక్షరాస్యత పెంపుతో జనాభా తగ్గుదల నమోదైంది. అయితే ఇటీవల కరోనా సమయం అనంతరం జనాభా స్థిరీకరణపై ప్రభుత్వాలు దృష్టిసారించాయి.
పట్ణణీకరణే ప్రధాన సమస్య
జిల్లాల విస్తరణ, కొత్త మున్సిపాలిటీల ఏర్పాటుతో ఉఫాది, సౌకర్యవంతమైన జీవనం కోరుతూ ప్రజలు నగరం బాట పడుతున్నారు. కొత్త జిల్లాలుగా ఏర్పడిన పెద్దపల్లి, జగిత్యాల, సిరిసిల్ల కేంద్రాల్లోనూ పట్టణీకరణ వేగం పుంజుకుంటోంది. ప్రభుత్వ వైద్యం, విద్యా సదుపాయాలను మెరుగుపరుస్తుండడం, కొత్త కట్టడాల నిర్మాణం పెరుగుతుండడంతో వివిధ వర్గాలకు ఉపాధి లభిస్తోంది. దీంతో ఆయా కేంద్రాల్లో జనాభా పెరుగుదల కనిపిస్తోంది. దీంతో మున్సిపాలిటీల్లో జనాభా ఒత్తిడి పెరుగుతుంది. ఆయా జనాభాకు అనుగుణంగా ప్రభుత్వం మౌలిక వసతులు కల్పించడం సవాలుగా మారుతుంది. పెరుగుతున్న పట్టణీకరణకు అనుగుణంగా వసతుల కల్పనపై ప్రత్యేక చొరవ చూపిస్తేనే సమస్యలు తీరనున్నాయి.

ప్రభంజనం

ప్రభంజనం