
ఫైనాన్స్ కార్యాలయాలపై పోలీసుల దాడులు
● 10 మందిపై కేసు..
రూ.60 లక్షల పత్రాలు స్వాధీనం
సిరిసిల్లక్రైం/ఇల్లంతకుంట/ఎల్లారెడ్డిపేట: రాజన్నసిరిసిల్ల జిల్లాలో వడ్డీ వ్యాపారుల ఆఫీస్‌లు, ఇళ్లపై జిల్లా పోలీసులు గురువారం దాడులు చేశారు. 20 బృందాలుగా ఏర్పడి జిల్లా వ్యాప్తంగా పలు మండలాల్లో తనిఖీలు చేపట్టారు. అక్రమంగా వడ్డీ వ్యాపారం చేస్తున్న పది మందిపై కేసులు నమోదుకాగా రూ.60లక్షల విలువైన పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ మహేశ్ బీ గీతే తెలిపారు. అప్పు ఇవ్వడానికి తాకట్టు పెట్టుకున్న నాలుగు బైక్‌లు, ఒక ఆటోను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అవసరాలను ఆసరాగా చేసుకొని వడ్డీతో సామాన్యులను ఇబ్బందులకు గురిచేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అనుమతితో ఫైనాన్స్ నిర్వహించే వారిని మాత్రమే నమ్మాలని, అనుమతి లేకున్నా అక్రమంగా ఫైనాన్స్ వ్యాపారం నడిపే వారి వివరాలు తెలపాలని కోరారు. సిరిసిల్లకు చెందిన నల్ల ప్రదీప్, దూస శ్రీనివాస్, దుబాల మొండయ్య, ఉషాకోయిలా మనోహర్, ఎనగందుల శ్రీహరి, ఒడ్నాల ఆంజనేయులు, బోయినపల్లికి చెందిన మేడిశెట్టి పురుషోత్తం, తాళ్లపల్లికి చెందిన గొర్ల రాములు, మల్లారెడ్డిపేటకు చెందిన బొందుగుల జగదీశ్వర్, దండవేని అశోక్‌లపై కేసులు నమోదు చేశారు.