
మద్యానికి బానిసై యువకుడి ఆత్మహత్య
తంగళ్లపల్లి(సిరిసిల్ల): మద్యానికి బానిసై యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని చీర్లవంచలో జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు.. చీర్లవంచకు చెందిన గంగు శ్రీనివాస్ (22) మద్యానికి బానిసై ఏ పని చేయక తిరుగుతూ ఉండేవాడు. సోమవారం రాత్రి గ్రామ శివారులోని డంపింగ్ యార్డులో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఉపేంద్రాచారి తెలిపారు.
అనారోగ్యంతో వృద్ధురాలు..
ఇల్లందకుంట: మండలంలోని మర్రివానిపల్లి గ్రామానికి చెందిన కాటిపల్లి అమృతమ్మ(70) అనారోగ్యంతో జీవితంపై విరక్తిచెంది వ్యవసాయబావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఇల్లందకుంట ఎస్సై క్రాంతికుమార్ వివరాల ప్రకారం.. అమృతమ్మ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. జీవితంపై విరక్తితో సోమవారం ఇంట్లోంచి బయటకు వెళ్లింది. రాత్రయినా ఇంటికి రాలేదు. కుటుంబసభ్యులు మంగళవారం చుట్టుపక్కల వెతుకుతుండగా.. గ్రామశివారులోని ఓ వ్యవసాయబావిలో మృతదేహం లభించింది. తనతల్లి అనారోగ్యంతో బాధపడుతోందని, జీవితంపై విరక్తితో ఆత్మహత్య చేసుకుందని అమృతమ్మ కొడుకు రవీందర్‌రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
15 కిలోల గంజాయి స్వాధీనం
జమ్మికుంట: జమ్మికుంటలోని ఎఫ్‌సీఐ సమీపంలో కరీంనగర్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు మంగళవారం 15కిలోల గంజాయిని పట్టుకున్నారు. కరీంనగర్‌కు చెందిన ముగ్గురు యువకులు, కమాలాపూర్ మండలం భీంపల్లికి చెందిన ఓ యువకుడు అంధ్రప్రదేశ్‌లోని సీలేరు ప్రాంతం నుంచి గంజాయి తీసుకొస్తున్నారన్న పక్కా సమాచారంతో పోలీసులు నిఘా పెట్టారు. రైలుమార్గం ద్వారా వస్తున్నారని తెలుసుకుని ముగ్గురిని ఎఫ్‌సీఐ సమీపంలో అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఈ విషయమై టౌన్ సీఐ రామకృష్ణను సంప్రదించగా, గంజాయి పట్టుకున్నది నిజమేనని, విచారణ తరువాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని వివరించారు.