
తండ్రి సాయంతో కొడుకు చోరీ
మంథని: మంథని మండలం బిట్టుపల్లి గ్రామంలో ఇటీవల జరిగిన చోరీ కేసులో తండ్రీకొడుకులను అరెస్ట్ చేసినట్లు సీఐ రాజు తెలిపారు. సోమవారం మంథని పోలీస్‌స్టేషన్‌లో వివరాలు వెల్లడించారు. గత 18న బిట్టుపల్లికి చెందిన కందుకూరి లక్ష్మి అనే మహిళ ఒంటరిగా ఉండటాన్ని గమనించిన ధర్మారం గ్రామానికి చెందిన తండ్రీకొడుకులు రాయినేని అనిల్, రాయినేని మల్లయ్య.. లక్ష్మి ఇంట్లో చొరబడి రెండు తులాల బంగారు గొలుసు ఎత్తుకెళ్లారు. లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్న క్రమంలో ఘటనా స్థలంలో అంబర్ ప్యాకెట్‌ను గుర్తించారు. ఈ క్రమంలో మలయ్య, అనిల్‌పై అనుమానంతో విచారించగా నేరం చేసినట్లు అంగీకరించారు. అలాగే మంథని మండలం పుట్టపాకలో ట్రాక్టర్, సుందిళ్ల పంపుహౌస్‌లో ఇనుపరాడ్స్, మంథని పెట్రోల్‌బంకు వద్ద బైక్, వాసవీనగర్‌లోని ఓ ఇంట్లో దొంగతనం, ముత్తారం మండలంలో వడ్ల చోరీ, రామగిరి మండలంలో రెండు ట్రాన్స్‌ఫార్మర్ల దొంగతనం కేసులను ఛేదించి నిందితులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఈ క్రమంలో పల్లెల్లో స్పెషల్‌డ్రైవ్ చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో మంథని, రామగిరి, ముత్తారం ఎస్సైలు పాల్గొన్నారు.