
నియోజకవర్గాన్ని నంబర్‌వన్‌గా తీర్చిదిద్దుతా
● ఎంపీ, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్
జమ్మికుంట రూరల్/వీణవంక: ఆరేళ్లలో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధి అభివృద్ధికి రూ.20వేల కోట్లకు పైగా నిధులను ఖర్చు చేశానని, కరీంనగర్ పార్లమెంట్ పరిధిని అభివృద్ధిలో నంబర్‌వన్‌గా తీర్చిదిద్దుతానని కరీంనగర్ ఎంపీ, కేంద్ర హోం శాఖ మంత్రి బండి సంజయ్ అన్నారు. శనివారం గండ్రపల్లి గ్రామంలో ఎన్‌ఆర్‌ఈజీఎస్ నిధులు రూ.78లక్షల వ్యయంతో నిర్మాణం చేసిన సీసీ రోడ్లను హుజూరాబాద్ నియోజకవర్గ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, ఉపాధ్యక్షుడు ఎర్రబెల్లి సంపత్‌రావు, మండల అధ్యక్షుడు సంపత్‌రావు, బీఆర్‌ఎస్ పీఏసీఎస్ చైర్మన్ పొనగంటి సంపత్, కేడీసీసీ వైస్ చైర్మన్ పింగిళి రమేశ్, తహసీల్దార్ వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పార్టీలకతీతంగా పని చేస్తా
వీణవంకలో జాతీయ ఉపాధిహామీ పథకం కింద రూ.1.56కోట్ల నిధులతో చేపట్టనున్న సీసీ రోడ్లను ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డితో కలిసి బండి సంజయ్ ప్రారంభించారు. ప్రజల అభ్యున్నతి కోసం రాజకీయ పార్టీలకతీతంగా స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులతో కలిసి పని చేస్తున్నానన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, పార్లమెంట్ కన్వీనర్ ప్రవీణ్‌రావు, బీజేపీ మండల అధ్యక్షుడు బత్తిని నరేశ్‌గౌడ్, జిల్లా కార్యదర్శి నరసింహారాజు, గొట్టిముక్కుల సంపత్‌రావు, దేవేందర్‌రావు, సమ్మిరెడ్డి, ఆదిరెడ్డి తదితరులున్నారు.