
నకిలీ డ్రగ్స్ దందా!
● కరీంనగర్‌లో జోరుగా నకిలీ మందుల విక్రయాలు ● ప్రాణాలతో చెలగాటమాడుతున్న మెడికల్ ఏజెన్సీలు ● వేణు ఏజెన్సీ డీలర్‌షిప్ రద్దు చేసిన సన్‌ఫార్మా ● అధికారుల ఉదాసీనతతో పేట్రేగుతున్న మాఫియా
కరీంనగర్‌టౌన్: కరీంనగర్ కేంద్రంగా డ్రగ్ మా ఫియా విచ్చలవిడిగా దందా సాగిస్తోంది. అక్రమ ధనార్జనే ధ్యేయంగా ప్రజల ప్రాణాలను ఫణంగా పెడుతున్నారు. బహిరంగంగానే నకిలీ మందులను రోగులకు అంటగడుతూ అడ్డగోలుగా సొమ్ము చేసుకుంటున్నారు. కొంతకాలంగా ఈ మాఫియా అధి కారుల కళ్లుగప్పి ప్రముఖ బ్రాండెడ్ కంపెనీ పేరుతో నకిలీ మందులను తీసుకువచ్చి రిటైల్ వ్యాపారులకు ఇస్తూ రోగులు ప్రాణాపాయ స్థితికి వెళ్లేందుకు కారణమవుతున్నారు. ఈ మందులతో రోగా లు పోవడం దేవుడెరుగు కొత్త రోగాలు వస్తుండడం, ఆరోగ్యం పూర్తిగా క్షీణిస్తుండడంతో బాధితులు లబోదిబోమంటున్నారు. మందులు నకిలీవో... అసలువో.. అవి రాస్తే ఏం జరుగుతుందో తెలియక డాక్టర్ల పరిస్థితి అగమ్యగోచంగా తయారవుతోంది. అధికారుల ఉదాసీనతతోనే డ్రగ్ మాఫియా పేట్రేగిపోతుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ప్రముఖ కంపెనీ పేరుతో..
కరీంనగర్‌కు చెందిన వేణు మెడికల్ ఏజెన్సీస్ పక్షవాతం వచ్చిన పేషెంట్లకు వాడే లివిపిల్–500 మెడిసిన్‌ను ప్రముఖ సన్‌ఫార్మా కంపెనీ తయారు చేస్తుండగా, ఆ కంపెనీ నుంచి డీలర్‌షిప్ హక్కును పొందింది. అక్రమ సంపాదనకు అలవాటు పడిన సద రు ఏజెన్సీ నిర్వాహకులు సన్ ఫార్మా నుంచి మందులు తెప్పించకుండా అధిక కమిషన్ల కోసం ఉత్తరప్రదేశ్ నుంచి తెప్పిస్తున్నట్లు గత ఏప్రిల్ నెలలో డ్రగ్ అధికారుల విచారణలో తేలింది. ఈ విషయమై సన్ ఫార్మా కంపెనీకి సమాచారాన్ని అందించడంతో నకిలీదని కంపెనీ ల్యాబ్ రిపోర్టుతో కరీంనగర్ డ్రగ్ అధికారులు, అసిస్టెంట్ డైరెక్టర్‌కు నివేదిక ఇచ్చారు. సన్‌ఫార్మా పంపిణీ చేసిన బ్యాచ్ నంబర్‌కు వేణు ఏజెన్సీలో ఉన్న మందులకు సంబంధం లేకపోకపోవడంతో నకిలీ మందులుగా గుర్తించి సన్‌ఫార్మా డీలర్‌షిప్‌ను రద్దు చేసి బ్లాక్ లిస్టులో పెట్టారు.
నకిలీ మందుల మూలాలపై దృష్టి
వేణు ఏజెన్సీ ద్వారా సరఫరా అవుతున్న లివిపిల్–500 నకిలీ మెడిసిన్ ఎవరు సరఫరా చేస్తున్నారనే విషయమై డ్రగ్ కంట్రోల్ అఽథారిటీ ద్వారా ఆరా తీస్తున్నాం. నకిలీ మందులు తయారు చేసే వారితో పాటు వాటిని తెప్పించి విక్రయించే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకునే విధంగా కేసులు నమోదు చేస్తాం. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే నకిలీ మందుల సరఫరాపై ఉపేక్షించేది లేదు.
– కార్తీక్ భరద్వాజ్, డ్రగ్ ఇన్స్‌పెక్టర్
ఈ మందులు ఎక్కడెక్కడికి వెళ్లాయి
పక్షవాతం వచ్చిన రోగులకు వాడే లివిపిల్–500 నకిలీ మందులను సరఫరా చేస్తున్న వేణు ఏజెన్సీ ఈ మందులను ఎక్కడెక్కడి రిటైల్ మందుల షాపులకు పంపిణీ చేసిందనే విషయంపై డ్రగ్ అధికారులు ఆరా తీస్తున్నారు. ఒక వేళ రోగులకు చేరితే రోగం తగ్గకపోగా మరింత ముదిరే ప్రమాదముండడంతో లివిపిల్–500 నకిలీ మెడిసిన్ నిలువరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. డ్రగ్ అధికారులు ఫిర్యాదులు వచ్చినప్పుడే తూతూ మంత్రంగా తని ఖీలు చేస్తుండడం, మిగతా సమయంలో చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నా యి. ఇది ఒక్క వేణు ఏజెన్సీకి సంబంధించన విషయమే. ఇలాంటి నకిలీ మందులు సరఫరా చేస్తున్న ఏజెన్సీలు నగరంలో ఉన్నాయని వాటిపై దృష్టిసారించి ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.