
హనుమాన్ పెద్ద జయంతికి ఏర్పాట్లు
మల్యాల: కొండగట్టు అంజన్న స్వామి ఆలయం పెద్ద జయంతికి ముస్తాబవుతోంది. ఈనెల 20 నుంచి 22 ఉత్సవాలు కొనసాగనున్నాయి. ఈ వేడుకలకు వివిధ రాష్ట్రాల నుండి సుమారు రెండు లక్షల మంది భక్తులు వస్తారని ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు. వారి కోసం నాలుగు లక్షల లడ్డూ ప్రసాదాలు సిద్ధం చేశారు. ఆలయాన్ని రంగురంగుల విద్యుత్‌దీపాలతో అలంకరించారు. చలువ పందిళ్లు వేశారు. హరిత హోటల్ సమీపంలో షెడ్డు నిర్మాణాన్ని శరవేగంగా చేపడుతున్నారు. జయంతికి వచ్చే భక్తుల కోసం జేఎన్టీయూ చెక్‌పోస్టు వద్ద, దిగువ కొండగట్టు వద్ద స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు. భక్తుల నీడ కోసం వైజంక్షన్ వరకు షామియానాలు ఏర్పాటు చేశారు. కాలినడకన వచ్చే భక్తులు ఇబ్బంది పడకుండా ఆలయ ప్రధాన ద్వారం వరకు కార్పెట్ వేశారు. ఎండల నేపథ్యంలో చలివేంద్రాలు, వైద్య శిబిరాలు ఏర్పాటు చేసేందుకు స్థలాలను ఎంపిక చేశారు. పార్కింగ్ స్థలాలను ఎంపిక చేసి, సమస్య తలెత్తకుండా చర్యలు చేపట్టారు. బొజ్జ పోతన్న ఆలయం నుంచి కొండగట్టు వై జంక్షన్ వరకు మూడు ఆర్టీసీ బస్సులను ఉచితంగా నడిపించనున్నారు. కోనేరులో ఎప్పటికప్పుడు నీరు నింపేలా చర్యలు చేపట్టారు. కోనేరు సమీపంలో 120 షవర్లు ఏర్పాటు చేశారు. కొండగట్టులో ఉన్న ఐదు లక్షల లీటర్ల సామర్థ్యం గల ట్యాంకులను నీటితో నింపారు.
– లడ్డూ ప్రసాదం కోసం ప్రత్యేకంగా ఏడు కౌంటర్లు, కేశఖండన, ప్రత్యేక దర్శనం టికెట్ల కోసం పది కౌంటర్లు ఏర్పాటు చేశారు. మూడు రోజులపాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఆలయ పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రం చేసేందుకు 381మంది కార్మికులను నియమించారు. ఫైరింజన్ యంత్రం మూడు రోజులు అందుబాటులో ఉండనుంది. భక్తులు అస్వస్థతకు గురైతే తక్షణమే చికిత్స అందించేందుకు వైద్య శిబిరాలతోపాటు 108 వాహనం అందుబాటులో ఉంచనున్నారు. ఆలయ పరిసరాల్లో ఇప్పటికే 64 సీసీ కెమెరాలుండగా.. అదనంగా మరో 48 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.
ఆర్జిత సేవలు రద్దు
కొండగట్టు శ్రీఆంజనేయస్వామి ఆలయంలో ఈనెల 20 నుంచి 23 వరకు ఆర్జిత సేవలు రద్దు చేస్తున్నట్లు ఆలయ ఈఓ శ్రీకాంత్ రావు ఒక ప్రకటనలో తెలిపారు. హనుమాన్ పెద్ద జయంతి ఉత్సవాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.
ముస్తాబవుతున్న కొండగట్టు
సిద్ధంగా లడ్డూ, ప్రసాదాలు
ఈనెల 20 నుంచి 22వరకు ఉత్సవాలు
ఉత్సవాలకు సర్వం సిద్ధం
హనుమాన్ పెద్ద జయంతి సందర్భంగా భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా అన్ని విభాగాల అధికారుల సమన్వయంతో సర్వం సిద్ధం చేశాం. ప్రత్యేక క్యూలైన్లు, లడ్డూప్రసాదాలు, కేశఖండన, ప్రత్యేక దర్శనాల కోసం ఏర్పాట్లు చేశాం. స్వామివారి జయంతి ఉత్సవాలను విజయవంతం చేయడంలో అందరూ సహకరించాలి.
– శ్రీకాంత్‌రావు, కొండగట్టు ఆలయ ఈఓ

హనుమాన్ పెద్ద జయంతికి ఏర్పాట్లు

హనుమాన్ పెద్ద జయంతికి ఏర్పాట్లు

హనుమాన్ పెద్ద జయంతికి ఏర్పాట్లు