
హోంగార్డుల బదిలీకి దర్బార్
● సీపీ గౌస్ ఆలం
కరీంనగర్‌క్రైం: హోంగార్డుల బదిలీకి కమిషనరేట్‌లో మంగళవారం సీపీ గౌస్ ఆలం ప్రత్యేకంగా దర్బార్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2016లో కొత్త జిల్లాలు ఏర్పాటయ్యాయని, ఆ సమయంలో తాత్కాలిక ప్రాతిపదికన కొత్త జిల్లాలకు కేటాయించబడిన హోంగార్డుల సంఖ్య ఆధారంగా బదిలీలు జరిగాయన్నారు. కరీంనగర్ నుంచి కొత్తగా ఏర్పడిన జిల్లాలకు బదిలీపై వెళ్లిన హోంగార్డులకు గత 9ఏళ్లుగా బదిలీలు జరగలేదన్నారు. వారి అభ్యర్థన మేరకు త్వరలో బదిలీలు చేపడతామని హామీ ఇచ్చారు. బదిలీలు పారదర్శకంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. ఇందుకోసం పోలీస్ కమిషనర్ అధ్యక్షతన ఇద్దరు ఏసీపీలు, ఏవో, రిజర్వ్ ఇన్స్‌పెక్టర్‌తో కూడిన కమిటీని ఏర్పాటు చేశామన్నారు. కరీంనగర్‌కు 300మంది హోంగార్డులు కేటాయించినట్లు తెలిపారు. జగిత్యాల, సిరిసిల్ల, సిద్దిపేట, హన్మకొండ, పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లాలకు బదిలీలు జరగనున్నాయని వెల్లడించారు. ఏవో ముని రామయ్య, ఏసీపీలు మాధవి, శ్రీని వాస్, ఇన్స్‌పెక్టర్లు శ్రీనివాస్, సురేశ్ పాల్గొన్నారు.