
కూడళ్లలో అప్రమత్తం
కోరుట్ల: భారత్, పాక్ యుద్ధం.. కాల్పుల విరమణ నేపథ్యంలో అసాంఘికశక్తుల కార్యకలాపాల విషయంలో అప్రమత్తంగా ఉండాలన్న ఉద్దేశంతో పోలీసు యంత్రాంగం జాగ్రత్తలు చేపట్టింది. ఇప్పటివరకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ప్రధాన పట్టణాల్లో ఐఎస్‌ఐ ప్రేరేపిత ఉగ్రసంస్థల మిలిటెంట్లు జనసమ్మర్ధం అధికంగా ఉండే ప్రాంతాల్లో బాంబులు పేల్చడం వంటి దుశ్చర్యలకు పాల్పడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థల స్లీపర్ సెల్స్ అవాంఛనీయ సంఘటనలకు పాల్పడే అవకాశం ఉందన్న కారణంగా పోలీసులు ముందు జాగ్రత్తలు చేపట్టారు.
గతంలో జరిగిన సంఘటనలు
● ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇదివరకు పలుచోట్ల పాక్ ఉగ్రవాద ప్రేరేపిత సంస్థలు బాంబులు పేల్చిన సంఘటనలు చోటు చేసుకున్నాయి.
● 2000 సంవత్సరంలో జగిత్యాల జిల్లా కేంద్రంలో లష్కర్ ఏ తోయిబాకు చెందిన మోస్ట్‌వాంటెడ్ తీవ్రవాది అజంఘోరి ఎన్‌కౌంటర్ జరిగింది.
● 1999లో మెట్‌పల్లి పట్టణంలో ప్రతిరోజు జనంతో నిండి ఉండే ఓ సినిమా టాకీస్‌లో బాంబు పేలింది.
● ఆ బాంబు పేలుడు తీవ్రత తక్కువగా ఉండటంతో పెద్దగా ప్రాణనష్టం జరగలేదు.
● ఆ బాంబు పేల్చివేత వెనక అజంఘోరి పాత్ర ఉందన్న ప్రచారం జరిగింది.
● 2005లో కరీంనగర్ బస్టాండ్‌లో బాంబు పేలి సుమారు 21 మందికి గాయాలు అయ్యాయి.
● ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి ఉగ్రవాద సంస్థల క్యాంప్‌కు వెళ్తూ రాజస్తాన్‌లోని జైసల్మేర్ వద్ద అక్కడి పోలీసులకు పట్టుబడ్డాడు.
● దీనికి తోడు గతంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పీఎఫ్‌ఐ కార్యకలాపాల ఉనికి వెలుగులోకి రావడం గమనార్హం.
● ఈ పరిస్థితుల నేపథ్యంలో భారత్–పాక్ కాల్పుల విరమణ కుదిరినప్పటికీ అవాంఛనీయ శక్తులు విచ్ఛిన్నకర సంఘటలకు పాల్పడే అవకాశాలు ఉన్నాయన్న కారణంగా పోలీసు యంత్రాంగం ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక పోలీసు పికెట్లు, తనిఖీలకు శ్రీకారం చుట్టింది.
జనసమ్మర్ధం ఉన్న కూడళ్లలో..
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కరీంనగర్, జగిత్యాల, సిరిసిల్ల, పెద్దపల్లి, మెట్‌పల్లి, కోరుట్ల, హుజూరాబాద్, వేములవాడ వంటి పట్టణాలతోపాటు ఇతర మండలాల్లోనూ జనసమ్మర్ధం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో పోలీస్ పికెటింగ్‌లు ఏర్పాటు చేస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు రెండురోజుల క్రితం జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి స్పెషల్ బ్రాంచీ పోలీసులు జనం ఎక్కువగా ఉండే కూడళ్ల విషయంలో పూర్తి స్థాయిలో ఆరా తీసి ఉన్నతాధికారులకు నివేదిక ఇచ్చారు. ఈ క్రమంలో ఆయా పట్టణాల్లో జనం ఎక్కువగా గుమిగూడే అవకాశాలు ఉన్న కూడళ్లలో ప్రతీరోజు పోలీసుల తనిఖీలు, పికెటంగ్‌లు ఏర్పాటుకు నిర్ణయించారు. శనివారం నుంచి అన్ని పట్టణాల్లో పకడ్బందీగా ఏర్పాట్లు చేసినట్లు సమాచారం. ఈ భద్రతా ఏర్పాట్లతో అవాంచనీయ సంఘటనలకు అడ్డుకట్ట పడుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
భారత్, పాక్ యుద్ధం.. విరమణ నేపథ్యంలో..
పోలీస్ యంత్రాంగం ముందస్తు చర్యలు