
ఉగ్రవాదాన్ని అంతమొందించాలి
కరీంనగర్: దేశంలో ఉగ్రవాదాన్ని తుదముట్టించి, మతసామరస్యాన్ని కాపాడాలని, ఛత్తీస్‌గఢ్‌లో ఆపరేషన్ కగార్‌ను వెంటనే ఆపాలని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు ఎస్.వీరయ్య డిమాండ్ చేశారు. శనివారం స్థానిక సుగుణాకర్‌రావు భవన్‌లో పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతి వారోత్సలు నిర్వహించార. ఈ సందర్భంగా పహల్గాం ఉగ్రదాడి, అనంతర పరిణామాలు అంశంపై సీపీఎం జిల్లా కార్యదర్శి మిల్కురి వాసుదేవరెడ్డి అధ్యక్షతన సెమినార్ జరిగింది. వీరయ్య మాట్లాడుతూ, పహల్గాం ఉగ్రదాడి దిగ్భ్రాంతికి గురిచేసిందని, అయితే, ఒక మతానికి వ్యతిరేకంగా మోదీ పరివారం సోషల్ మీడియాలో ప్రచారం చేసిందని, ఇది దేశ ఐక్యతను దెబ్బతీస్తుందన్నారు. కశ్మీర్ ముస్లింలే పర్యాటకులను కాపాడారని, రైల్వే, ఎయిర్‌పోర్టులకు ఉచితంగా పర్యాటకులను చేరవేశారన్నారు. అదే కార్పొరేట్ శక్తులు ఎయిర్‌లైన్స్‌లో రూ.6 వేలు ఉన్న టిక్కెట్‌కు రూ.60వేలకు పెంచారన్నారు. ఈ ఉగ్రదాడిలో ఒకముస్లిం హార్స్ రైడర్ చనిపోయారన్నారు. తామంతా ఒకటిగా ఉన్నామని అక్కడి ముస్లింలు నినదించిన విషయాన్ని మర్చిపోకూడదన్నారు. యుద్ధంతో ఉగ్రవాదాన్ని అణచివేసిన ఉదంతాలు ప్రపంచంలోనే లేవన్నారు. కాల్పుల విరమణ తర్వాత ట్రంప్ వైఖరిపై మోదీ నోరు మెదపలేదన్నారు. ఉగ్రవాదుల అంతు తేల్చామని ఒకవైపు ప్రధాని చెబుతున్నారని, నేటికీ ఒక్క ఉగ్రవాదిని కూడా పట్టుకోలేదని ఎద్దేవా చేశారు. కాల్పుల విరమణ అనంతరం అఖిలపక్ష సమావేశాన్ని ఎందుకు నిర్వహించలేదని ప్రశ్నించారు. ఉగ్రదాడి అనంతర పరిణామాలపై పార్లమెంట్లో ఎందుకు చర్చించలేదన్నారు. మావోయిస్టులు చర్చలకు వస్తామని ప్రకటించినా.. కేంద్ర ప్రభుత్వం ఎన్‌కౌంటర్లకు పాల్పడడం శోచనీయమన్నారు. అడవిలో ఉన్నవారు ప్రజల కోసం పోరాడుతున్నారు తప్ప వ్యక్తిగత హింస చేయడం లేదన్నారు. నాయకులు వర్ణ వెంకటరెడ్డి, గీట్ల ముకుందరెడ్డి, గుడికందుల సత్యం, బీమా సాహెబ్, సుంకర సంపత్, ఎడ్ల రమేశ్, జి.రాజేశం, కోనేటి నాగమణి, తిప్పారపు సురేశ్, జి.తిరుపతి నాయక్, కొంపెల్లి అరవింద్, రాజమల్లు, నరసింహారెడ్డి, రామ్మోహన్, శ్రీధర్, మాతంగి శంకర్, పుల్లెల మల్లయ్య, విద్యాసాగర్, వామన్‌రావు, వెంకటేశ్వర్లు, బోడ మోహన్ నాయక్, సాగర్ తదితరులు పాల్గొన్నారు.
ఆపరేషన్ కగార్‌ను వెంటనే ఆపాలి
సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు వీరయ్య