
అంగన్‌వాడీ, ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు పెంచాలి
● 10వ తరగతి ఫెయిలైన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి ● కలెక్టర్ పమేలా సత్పతి
కరీంనగర్: రానున్న విద్యాసంవత్సరంలో అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు పెంచాలని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. అంగన్‌వాడీ, ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్ల పెంపు, పదోతరగతి సప్లిమెంటరీ పరీక్షలు తదితర అంశాలపై ఐసీడీఎస్, విద్యాశాఖ సమన్వయ సమావేశం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో శుక్రవారం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. అంగన్వాడీ బాట నిర్వహించి ఆరు సంవత్సరాల్లోపు పిల్లలందరినీ అంగన్వాడీలో చేర్పించాలని ఆదేశించారు. అంగన్వాడీ సేవలు, నూతన సిలబస్ ద్వారా ఇస్తున్న ప్రత్యేక బోధన గురించి తల్లిదండ్రులకు తెలియజేస్తూ నమోదును పెంచాలన్నారు. అంగన్వాడీలో ప్రీస్కూల్ పూర్తి చేసిన పిల్లలందరి జాబితా మండల విద్యాధికారులకు సమర్పించాలని సూచించారు. ఈ జాబితాలో ఉన్న పిల్లలందరూ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చేరేలా ప్రధానోపాధ్యాయులు, ఎంఈవోలు ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఆదేశించారు. ప్రైవేటు భవనాల్లోని అంగన్‌వాడీ కేంద్రాలన్నీ స్థానిక ప్రభుత్వ పాఠశాలలు, ఖాళీగా ఉన్న ప్రభుత్వ భవనాలకు మార్చాలని అన్నారు. ఇప్పటికే మా ర్చాల్సిన అంగన్‌వాడీ కేంద్రాలను గుర్తించామని, ప్రభుత్వ భవనాల్లో ఈ కేంద్రాలకు కావాల్సిన వసతులు సమకూరుస్తామన్నారు. 2015 నుంచి 2023 వరకు పదోతరగతి ఫెయిలై చదువు ఆపేసిన విద్యార్థులందరినీ గుర్తించి వచ్చే సంవత్సరం వారు 10వతరగతిలో ఉత్తీర్ణులయ్యేలా అవగాహన కల్పించాలని మండల విద్యాధికాలను ఆదేశించారు. ఈ ఏడాది పదోతరగతి ఫెయిలైన విద్యార్థులందరూ వచ్చే జూన్ నెలలో సప్లిమెంటరీ రాసి ఉత్తీర్ణులయ్యేలా శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్ మాట్లాడుతూ.. మండల విద్యాధికారులు ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలలను సందర్శించాలని ఆదేశించారు. అక్కడ మౌలిక వసతుల కల్పనకు గ్రౌండింగ్‌పై దృష్టి పెట్టాలని అన్నారు. సమ్మర్ క్యాంపులను పరిశీలించాలని, బడిబాటపై దృష్టి పెట్టాలన్నారు. ఈ సమావేశంలో డీటీడీవో పవన్‌కుమార్, జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి, జిల్లా విద్యాధికారి జనార్దన్‌రావు, క్వాలిటీ కోఆర్డినేటర్ అశోక్‌రెడ్డి, కోఆర్డినేటర్లు మిల్కూరి శ్రీనివాస్, ఆంజనేయులు, సీడీపీవోలు సబితా, శ్రీమతి, నర్సింగారాణి, సుగుణ, మండల విద్యాధికారులు, సూపర్‌వైజర్లు పాల్గొన్నారు.