బస్ షెల్టరే నివాసం..
రామగుండం: పెద్దపల్లి జిల్లా రామగుండం ముబారక్‌నగర్‌కు చెందిన కప్పల లక్ష్మి(80) కూలీ పనులు చేసుకుంటూ పొట్టపోసుకుంటోంది. ఆమెకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వీరందరికీ వివాహం జరిపించింది. ఇద్దరు కుమారులు కొన్నేళ్ల క్రితమే మృతిచెందారు. పెద్ద కూతురు–అల్లుడు స్థానికంగా ఓ గుడిసెలో నివాసం ఉంటూ కూలీ పనులు చేసుకుంటున్నారు. రెండోకూతురు మాటూరి పద్మ తన అత్తగారిల్లు ములుగు జిల్లా బయ్యారంలో ఉండేది. అక్కడ ఉపాధి లేక పొట్టచేత పట్టుకుని భర్త వీరన్న, కుమారులు పవన్, చరణ్‌తో కలిసి ఏడాది క్రితం రామగుండం చేరుకుంది. సొంత ఇల్లు లేక, అద్దె ఇంట్లో ఉండే స్థోమత లేక తన తల్లి లక్ష్మితో కలిసి బస్ షెల్టర్‌లోనే నివాసం ఉంటోంది. పద్మ కూలీ పనులకు వెళ్తుండగా, ఆమె భర్త ప్లాస్టిక్ కవర్లు, వస్తువులు సేకరించి స్క్రాప్ దుకాణంలో విక్రయిస్తున్నారు. ఇద్దరి సంపాదన కుటుంబ పోషణకు సరిపోవడం లేదు. పద్మ కుమారులు మాటూరి పవన్, చరణ్ స్థానికంగా ఓ ప్రభుత్వ పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్నారు. అయితే, పొద్దున బడికి వెళ్లేవచ్చే చిన్నారు.. రాత్రిళ్లు చదువుకునేందుకు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒకవైపు దోమలతో సహవాసం చేస్తున్నారు. వర్షాకాలంలో బట్టలు తడుస్తుండడం, చలికాలంలో చలికి గజగజ వణుకుతూ అవస్థలు ఎదుర్కొంటున్నారు. వేసవిలో ఎండవేడికి తాళలేకపోతున్నారు. దాతలు ఎవరైనా ముందుకు వచ్చి తమను ఆదుకోవాలని చిన్నారులు, వారి తల్లిదండ్రులు చేతులు జోడించి వేడుకుంటున్నారు.
ఏడాదిగా ఓ కుటుంబం నరకయాతన
భవిష్యత్ అంధకారం