● ఆ అధికారి ఎలా చెబితే అలా నడవాల్సిందే.. ● చెప్పినట్టు వినకుంటే మార్చేయడమే
కరీంనగర్ అర్బన్: అతనో తహసీల్దార్. హుందాగా వ్యవహరించాల్సిన సదరు పోస్టుకు కళంకం తేవడం చర్చనీయాంఽశంగా మారింది. కార్యాలయ అధికారులు, ఉద్యోగులైనా, వివిధ పనుల నిమిత్తం వచ్చే ప్రజలైనా ఎవరి మాట వినడు. ప్రతీ పనికో రేటు నిర్ణయించి వసూళ్లు చేస్తుండగా కొందరు రాజకీయ నేతలు(ప్రతిపక్ష, అధికారపక్ష), కార్యాలయంలోని ఓ ఉద్యోగి కేంద్రంగా రెవెన్యూ కార్యవర్తనాలు కొనసాగడం ఆశ్చర్యకర అంశం. జిల్లాకేంద్రంలో ఓ ఉన్నతాధికారి అండ పుష్కలంగా ఉండటంతో సదరు అధికారి ఆగడాలకు అడ్డూఅదుపూ లేకుండా పోయిందని ఇంట, బయట వినిపిస్తున్న మాట.
ప్రతీ పనికో రేటు
ఇతర జిల్లాలో పనిచేసిన సదరు అధికారి ఎక్కడా కుదురుగా ఉండరన్న ఆరోపణలున్నాయి. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ల జారీకి రూ.50వేల నుంచి లక్ష వరకు వసూలు చేస్తుండగా ఇందుకు పలువురు అధికార, ప్రతిపక్ష రాజకీయ నేతలు రాయబారులుగా, కార్యాలయంలోని ఓ ఉద్యోగి కీలకమని తెలుస్తోంది. ఈ విషయంలో గతేడాది ఉన్నతాధికారి విచారణకు ఆదేశించగా సదరు ఆదేశాలను పక్కనబెట్టడం ఇతనికే చెల్లు. ఇక ఇటుక బట్టీలు, ఇసుక ట్రాక్టర్ల యజమానులు మామూళ్లు ఇవ్వాల్సిందే.
చెప్పినట్లు వినకుంటే మార్చడమే
సదరు అధికారి ఎలా చెబితే అలా నడవాల్సిందే. వినని ఓ గిర్దావర్‌ను కావాలని అక్కడి నుంచి బదిలీ చేయించాడనే ఆరోపణలున్నాయి. గతంలో ఓ దళితురాలికి ఇచ్చిన అసైన్డ్ భూమి విషయంలో కావాలనే భయభ్రాంతులకు గురిచేస్తున్నారని సమాచారం. ఓ జిల్లాకేంద్రంలో పనిచేసినప్పుడు కూడా విధులను నిర్లక్ష్యం చేయడం, అవినీతి ఆరోపణలతో 4నెలల్లోనే ఇతర ప్రాంతానికి బదిలీ చేశారు. మొత్తంగా సదరు అధికారి వ్యవహారంపై ఇంట, బయట తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయితే సదరు తహసీల్దార్‌పై ఫిర్యాదులు ఎక్కువవయ్యాయని, విచారణ జరుగుతోందని కలెక్టరేట్ వర్గాలు తెలిపాయి.
‘జిల్లాలోని ఓ మండల పరిధిలో ఉన్న గ్రామంలో సంపన్న కుటుంబమది. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ కోసం తహసీల్దార్‌కు దరఖాస్తు చేశారు. 15ఎకరాల వ్యవ సాయ భూమి ఉండగా సర్టిఫికెట్ జారీ చేశారు. మామూళ్లు ముట్టడంతో నిబంధనలు అటకెక్కించారని సమాచారం’.
‘ఓ మండలంలోని ఓ రైతు నాలా కన్వర్షన్ కోసం దరఖాస్తు చేశాడు. నిబంధనల ప్రకారం అన్నీ సక్రమంగా ఉన్నా నాలా చేయరాదంటూ మౌఖికంగా సదరు తహసీల్దార్ తిరస్కరించాడు. కొన్ని రోజులు ఇబ్బందులకు గురిచేసి తీరా మామూళ్లు ముట్టాక నాలా కన్వర్షన్ క్షణాల్లో జరిగిపోయింది’.