అక్రమ పట్టాదారుడు అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

అక్రమ పట్టాదారుడు అరెస్ట్‌

Mar 20 2025 1:47 AM | Updated on Mar 20 2025 1:44 AM

తహసీల్దార్‌తోపాటు ముగ్గురిపై కేసు

చందుర్తి(వేములవాడ): పట్టాదారులకు తెలియకుండా భూమిని అక్రమ పట్టా చేసుకున్న వ్యక్తితోపాటు తహసీల్దార్‌, వీఆర్వోపై కేసు నమోదు చేసినట్లు చందుర్తి ఎస్సై అంజయ్య తెలిపారు. ఎస్సై అంజయ్య తెలిపిన వివరాలు. చందుర్తి మండలం మల్యాల గ్రామానికి చెందిన దొంగరి వెంకటరాములుకు చెందిన 73 సర్వేనంబర్‌లో 2.08 ఎకరాల భూమిని, అదే సర్వేనంబర్‌లోని దొంగరి శంకర్‌కు చెందిన 2.07 ఎకరాలను అదే గ్రామానికి చెందిన ఈర్లపల్లి రాములు ఉరప్‌ చిన్నరాములు 4.15 ఎకరాల పట్టా చేసుకున్నారు. బాధితుల ఫిర్యాదుతో అక్రమ పట్టా చేసుకున్న ఈర్లపల్లి రాములుతోపాటు పట్టాచేసిన అప్పటి తహసీల్దార్‌ రాజగోపాల్‌రావు, వీఆర్వో రాజేశంలపై కేసు నమోదు చేశారు. అక్రమ పట్టా చేసుకున్న రాములును పోలీసులు అదుపులోకి తీసుకోగా, తహసీల్దార్‌, వీఆర్వోలు పరారీలో ఉన్నారు. త్వరలోనే పట్టుకోనున్నట్లు ఎస్సై తెలిపారు.

చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి

మానేరువాగులో ఉదయ్‌ మృతదేహం

ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): మండలంలోని నారాయణపూర్‌కు చెందిన కమటం ఉదయ్‌(35) మానేరువాగులోకి చేపల వేటకు వెళ్లి మృతిచెందాడు. ఇంటి నుంచి రెండు రోజుల క్రితం వెళ్లిన వ్యక్తి వాగులో శవమై తేలడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. ఎస్సై రమాకాంత్‌ తెలిపిన వివరాలు. ఉదయ్‌ సెంట్రింగ్‌ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈనెల 17న సోమవారం ఉదయం ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. రెండు రోజుల నుంచి ఉదయ్‌ ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు బంధువుల ఇళ్లల్లో గాలించారు. ఈక్రమంలోనే బుధవారం మానేరువాగులో శవమై తేలినట్లు తెలియడంతో కుటుంబ సభ్యులు వెళ్లి ఉదయ్‌గా గుర్తించారు. చేపలు పడుతున్న క్రమంలో అదుపుతప్పి వాగులో పడి నీట మునిగినట్లు భావిస్తున్నారు. మృతుడికి భార్య సరళ, ఇద్దరు కూతుళ్లు అత్విక, అశ్విక ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రమాకాంత్‌ తెలిపారు.

విద్యుత్‌షాక్‌తో ఒకరు..

మానకొండూర్‌: మానకొండూర్‌ మండలం లక్ష్మీపూర్‌ గ్రామానికి చెందిన తాండ్ర దేవయ్య(54) బుధవారం ఉదయం విద్యుత్‌షాక్‌తో మృతి చెందాడు. గ్రామస్తులు, పోలీసుల వివరాల ప్రకారం.. లక్ష్మీపూర్‌ గ్రామానికి చెందిన తాండ్ర దేవయ్య వ్యవసాయంతో పాటు కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. బుధవారం ఉదయం ఇంటిపై ఉన్న పరదా తీయడానికి పైకి ఎక్కాడు. పరదా తీస్తుండగా, ఇనుప చువ్వల ద్వారా విద్యుత్‌ సరఫరా కావడంతో షాక్‌కు గురై అపస్మారక స్థితికి వెళ్లిపోయాడు. కుటుంబ సభ్యులు కరీంనగర్‌కు తరలిస్తుండగా చనిపోయాడు. దేవయ్యకు ఇద్దరు కొడుకులు, కూతురు ఉన్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

రథోత్సవానికి తీసుకెళ్లలేదని ఆత్మహత్య

ధర్మపురి: ధర్మపురిలోని శ్రీలక్ష్మీనృసింహస్వామి రథోత్సవానికి తీసుకెళ్లడం ఆలస్యమవుతుందని తండ్రి చెప్పినందుకు క్షణికావేశంలో యువతి ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మండలంలోని దమ్మన్నపేటలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన తోడేటి రాజమల్లు, మంజుల దంపతులకు ఇద్దరు కూతుళ్లు. పెద కూతురు మహేశ్వరి (19) ఇంటర్‌ చదివి ఇంటి వద్దనే ఉంటోంది. నృసింహుని జాతరకు తీసుకెళ్లాలని తండ్రి కోరగా.. తాళ్లు ఎక్కివచ్చి తీసుకెళ్తానని చెప్పాడు. దీనికి మహేశ్వరి మొండికేసింది. తండ్రి తాళ్లు ఎక్కడానికి వెళ్లగా ఇంట్లోనే ఉరేసుకుంది. తల్లి మంజుల ఎంత బతిమిలాడినా తలుపులు తీయకపోవడంతో చుట్టుపక్క వాళ్లను పిలిచి తలుపులు పగులగొట్టింది. అప్పటికే మహేశ్వరి మృతి చెందింది. ఏఎస్సై రాజు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మహేశ్వరి తల్లి మంజూల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై తెలిపారు.

అక్రమ పట్టాదారుడు అరెస్ట్‌1
1/1

అక్రమ పట్టాదారుడు అరెస్ట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement