
ప్రపంచస్థాయి ప్రయోగశాలగా పని చేయాలి
● యువత నైపుణ్యత ఆధారంగా పరిశ్రమలు ● రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ● గ్రామీణ ప్రొటో టైపింగ్, ఇన్నోవేషన్ సెంటర్ ప్రారంభం
మంథని: పల్లెవాసుల్లో దాగిఉన్న నైపుణ్యానికి దోహదపడేలా మంథనిలో తొలిసారి ఏర్పాటు చేసిన గ్రామీణప్రొటో టైపింగ్ ఇన్నోవేషన్ సెంటర్ ప్రపంచస్థాయి ప్రయోగశాలగా పని చేయాలని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఆకాంక్షించారు. స్థానిక ఆర్టీసీ బస్సు డిపో ఎదుట డ్రీమ్ స్టార్ట్ రైస్ ఇన్నోవేషన్ నెట్‌వర్క్‌లో భాగంగా ఏర్పాటు చేసిన గ్రామీణ ప్రొటో టైపింగ్–ఇన్నోవేషన్ సెంటర్‌ను కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి మంత్రి సోమవారం ప్రారంభించారు. అనంతరం జరిగిన సమావేశంలో శ్రీధర్‌బాబు మాట్లాడుతూ, టీ వర్క్స్ వ్యవస్థ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థులకు, ప్రజలకు అవగాహన కల్పించడంతోపాటు సాంకేతికతపరంగా వారిలోని నైపుణ్యం వెలికి తీయడానికి సెంటర్ ఉయోగపడుతుందన్నారు. హైదరాబాద్‌లో పనిచేసే టీ వర్క్స్ బృందం నుంచి ముగ్గురు శిక్షకులను ఇక్కడ నియమిస్తామని తెలిపారు. జిల్లాలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు ప్రొటో టైపింగ్ – ఇన్నోవేషన్ సెంటర్‌ను పరిశీలించేలా చూడాలని కలెక్టర్‌కు మంత్రి సూచించారు. రైతు సమస్యల పరిష్కారానికి సహకారం అందిస్తామని అన్నారు. మంథనిలో చిన్న సాఫ్ట్‌వేర్ కంపెనీని తీసుకొవచ్చామని, విద్యార్థుల్లోని నైపుణ్యాన్ని చూపించి భవిష్యత్‌లో అనేక కంపెనీలను తీసుకొవస్తామని మంత్రి తెలిపారు. రోజూవారి సమస్యలను సాంకేతికతను వినియోగించి మార్పులు చేస్తే పరిష్కారం అవుతాయని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. టీ వర్క్స్ డైరెక్టర్ జోగేందర్, ఆర్డీవో సురేశ్, నాయకులు శశిభూషణ్ కాచే, కొత్త శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.
3వేల మెగావాట్ల సోలార్ విద్యుత్
రైతులు, గృహావసరాలు, పరిశ్రమలకు ఇబ్బంది రావొద్దనే లక్ష్యంతో ప్రభుత్వం సంస్కరణలు తీసుకొచ్చి 3 వేల మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా ముందుకు సాగుతోందని మంత్రి తెలిపారు. గుంజపడుగు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో రూ.2.90 కోట్లతో పీఏం కుసుమ్ కార్యక్రమం కింద చేపట్టనున్న సోలార్ ప్రాజెక్టు మంజూరు పత్రాలను మంథనిలో కరీంనగర్ డీసీసీబీ చైర్మన్ రవీందర్‌రావు, కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి పంపిణీ చేశారు. మంథనితోపాటు అప్పన్నపేట, కాల్వశ్రీరాంపూర్, ధర్మారం, చొప్పదండిలో సోలార్ ప్రాజెక్టుల ఏర్పాటు కోసం కరీంనగర్ సహకార బ్యాంకు నుంచి రూ.3 కోట్ల రుణం మంజూరు చేశారన్నారు. కేడీసీసీబీ సీఈవో సత్యనారాయణ, జిల్లా సహకార అధికారి శ్రీమాల, సిరిసిల్ల గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్యనారాయణగౌడ్, ఆర్టీఐ సభ్యుడు సురేశ్, సంఘం కార్యదర్శి అశోక్‌కుమార్ తదితరులు ఉన్నారు.