
మహిళ దారుణ హత్య
కేసు పెట్టారని కక్ష..
చందుర్తి(వేములవాడ): భూవివాదం ఓ మహిళ హత్యకు దారి తీసింది. కేసు పెట్టిందని కక్ష పెంచుకున్న ఓ యువకుడు మహిళను నడి రోడ్డుపై కడతేర్చాడు. ఈ ఘటన రాజన్నసిరిసిల్ల జిల్లా చందుర్తిలో సోమవారం జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు.. చందుర్తి మండల కేంద్రానికి బొల్లు మల్లవ్వ(57), ఆమె మరిది మధ్య నాలుగేళ్లుగా భూమి విషయంలో వివాదం ఉంది. అప్పటి నుంచి ఇరు కుటుంబాల మధ్య భూమి పంచాయితీ నడుస్తోంది. పంచాయితీ పరిష్కారం కాకపోవడంతో మల్లవ్వ ఇరువై రోజుల క్రితం పోలీసులను ఆశ్రయించింది. ఎస్సై అంజయ్య ఇరు కుటుంబాలను స్టేషన్‌కు పిలిపించి పంచాయితీ పెద్దల మధ్య పరిష్కరించుకోవాలని సూచించారు. ఈక్రమంలో మల్లవ్వ సోమవారం సాయంత్రం గ్రామ శివారులోని పశువుల కొట్టం వద్దకు వెళ్లి వస్తుండగా.. పెద్దమ్మ గుడి వద్ద కాపు కాసిన తన మరిది కొడుకు బొల్లు మనోజ్ వేట కొడవలితో దాడి చేశాడు. మల్లవ్వ మెడపై కత్తితో దాడి చేసి చంపి.. నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. సంఘటన స్థలాన్ని చందుర్తి సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై అంజయ్య పరిశీలించారు. అయితే హత్యకు పాల్పడ్డ బొల్లు మనోజ్ గతంలో ఓ వ్యక్తిని చంపాడు. ఆ సమయంలో మైనర్ కావడంతో జువైనల్ జైలుకు వెళ్లి వచ్చాడు. మృతురాలి బంధువులు రోడ్డుపై బైఠాయించారు. వారు మాట్లాడుతూ నిందితునికి పోలీసులు కొమ్ముకాస్తున్నారంటూ ఆరోపించారు. మృతురాలికి భర్త రాజయ్య, కుమారుడు రాజు, కూతురు ఉన్నారు. కుమారుడు రాజు జీవనోపాధి కోసం గల్ప్ వెళ్లాడు. చందుర్తిలో ఎలాంటి అల్లర్లు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
పోలీసుల ఎదుట లొంగిపోయిన నిందితుడు
ఆందోళనకు దిగిన
మృతురాలి బంధువులు

మహిళ దారుణ హత్య