ఇల్లంతకుంట(మానకొండూర్): ట్రాక్టర్ డ్రైవర్ అజాగ్రత్తతో అతని పక్కనే కూర్చున్న కౌలు రైతు టైరు కింద పడి అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ సంఘటన మంగళవారం రాజన్నసిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం నర్సక్కపేటలో విషాదం నింపింది. ఎస్సై శ్రీకాంత్‌గౌడ్ తెలిపిన వివరాలు. నర్సక్కపేటకు చెందిన చీకోటి నర్సయ్య(65) మండలంలోని వంతడుపుల గ్రామంలో నాలుగెకరాలను కౌలుకు తీసుకొని మొక్కజొన్న పంట వేశాడు. మంగళవారం మొక్కజొన్న కంకులను ట్రాక్టర్‌లో వేసుకొని సమీప పౌల్ట్రీఫామ్ వద్ద ఆరబోస్తున్నాడు. ఈ క్రమంలో ట్రాక్టర్‌లో నుంచి మొక్కజొన్న కంకులను దించి తిరిగి వెళ్తుండగా డ్రైవర్ పక్కనే కూర్చున్న నర్సయ్య ఎగిరి టైర్ కింద పడి అక్కడికక్కడే మృతిచెందాడు. అతివేగంగా ట్రాక్టర్ నడిపిన బిహార్‌కు చెందిన డ్రైవర్ సురేందర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని మృతుని కూతురు కామభాగ్య ఫిర్యాదు చేసింది.
బావిలో పడి విద్యార్థిని..
మానకొండూర్: కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం కెల్లెడ గ్రామపరిధిలోని కందులపల్లెలో ప్రమాదవశాత్తు చేదబావిలో పడి వి ద్యార్థిని మృతి చెందింది. సీఐ సంజీవ్ వివరాల ప్రకా రం.. కందులపల్లెకు చెందిన కందుల స్వప్న, ముత్తయ్య దంపతులకు కొడుకు రాజు, కూతురు అశ్విత(20) ఉన్నారు. అశ్విత ఎంబీఏ మొదటి సంవత్సరం చదువుతోంది. మంగళవారం ఉద యం తల్లిదండ్రులు పనులకు వెళ్లారు. ఇంటివద్ద అశ్విత చేదబావిలో నీరు తోడుతున్న క్రమంలో ప్రమాదవశాత్తు కాలుజారి బావిలో పడిపోయింది. రాజు గేదెలకు నీళ్లుపెట్టి కాళ్లు కడుక్కునేందుకు బావి వద్దకు రాగా.. అశ్విత బావిలో పడిఉండడాన్ని గమనించాడు. స్థానికుల సాయంతో బయటకు తీయగా.. అప్పటికే చనిపోయింది. తల్లిదండ్రులు బోరున విలపించారు. ఈ మేరకు పోలీసులు పంచనామా నిర్వహించారు.
రోడ్డు ప్రమాదంలో జడ్జి తల్లికి గాయాలు
జగిత్యాలక్రైం: జగిత్యాలలోని గాంధీనగర్ వద్ద మంగళవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో నాంపెల్లి కోర్టు జడ్జి సుస్మిత తల్లి వడ్లూరి దేవమ్మ గాయపడింది. దేవమ్మను గాంధీనగర్ ప్రాంతానికి చెందిన బొల్లారపు హర్షవర్ధన్ ద్విచక్రవాహనంతో ఢీకొట్టగా.. తీవ్రంగా గాయపడింది. దేవమ్మది జగిత్యాల రూరల్ మండలం తక్కళ్లపల్లి గ్రామం. గాంధీనగర్‌లోని తన సోదరి వద్దకు వెళ్లింది. తిరిగి తక్కళ్లపల్లి వెళ్లేందుకు రోడ్డు పక్కన ఉండగా.. హర్షవర్ధన్ ద్విచక్రవాహనంపై వస్తూ ఢీకొట్టాడు. స్థానికులు ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించారు. సుస్మిత సోదరుడు శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు హర్షవర్ధన్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై మన్మథరావు తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో దంపతులకు..
సారంగాపూర్: బీర్‌పూర్ మండలం ఇందిరానగర్ శివారులో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలు తీవ్రంగా గాయపడ్డారు. ధర్మపురి మండలం నక్కలపేటకు చెందిన భూక్య భారతి, ఆమె భర్త భూక్య తిరుపతి ఇద్దరు ద్విచక్రవాహనంపై బీర్‌పూర్ మండలం రంగసాగర్‌లోని భారతి తల్లిగారింటికి వచ్చారు. తిరిగి వెళ్తుండగా ఇందిరానగర్ వద్ద వీరి వాహనాన్ని టిప్పర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో భారతి తీవ్రంగా, తిరుపతి స్వల్పంగా గాయపడ్డారు. వారిని జగిత్యాల ఆస్పత్రికి.. అక్కడి నుంచి కరీంనగర్ తరలించారు.