
కర్బూజ రైతు నష్టాలపాలు
● అకాల వర్షాలతో ఆగం
● రూ.లక్షలు వస్తాయనుకుంటే..
ఖర్చులు కూడా రాలేదంటున్న వైనం
● పురుగు పట్టి పనికి రాకుండా పోయిన కాయలు
జగిత్యాలఅగ్రికల్చర్: కొద్ది రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలు రైతులను అతులాకుతలం చేశాయి. ముఖ్యంగా వేసవిలో కర్బూజ, తర్బూజ వంటి ఉ ద్యాన పంటలను సాగు చేసిన రైతులను కోలుకోకుండా చేశాయి. జిల్లాలో యువ రైతులు వినూత్నంగా సాగు చేసిన కర్బూజ(పుచ్చకాయ) పంటను మరో వారం రోజుల్లో మార్కెట్‌కు తీసుకెళ్లే తరుణంలో కురిసిన వర్షాలు దెబ్బతీశాయి. ప్రభుత్వం నష్టపరిహారం అందజేసి తమను ఆదుకోవాలని కోరుతున్నారు.
100 ఎకరాల్లో సాగు..
జిల్లాలో వేసవిలో చల్లదనాన్నిచ్చే కర్బూజ, తర్బూజ, జన్నత్ వంటి పండ్ల తోటలను దాదాపు 100 ఎకరాలకు పైగా సాగు చేశారు. రెండు, మూడేళ్లుగా యువ రైతులు సాగు చేస్తూ.. నేరుగా మార్కెటింగ్ చేస్తూ మంచి అదాయాన్ని పొందుతున్నారు. సారంగాపూర్ మండలం పెంబట్లకు చెందిన బండారి వెంకటేశ్, మల్లాపూర్ మండలం సిర్పూర్‌కు చెందిన నరేశ్, రాయికల్ మండలం అలూరుకు చెందిన మెక్కొండ రాంరెడ్డి, రాజు, మల్లారెడ్డి, ధర్మారంకు చెందిన రాజు, రాజిరెడ్డి అనే యువ రైతులు 25 ఎకరాల వరకు సాగు చేసి తీవ్రంగా నష్టపోయారు. తమ పంటను జగిత్యాల, మెట్‌పల్లి, కోరుట్ల పట్టణాల్లో నేరుగా విక్రయిస్తుండడంతోపాటు హైదరాబాద్‌లోని పలు కార్పొరేట్ సంస్థలతో కూడా ఒప్పందం చేసుకున్నారు. హైదరాబాద్‌లో వర్షాలు కురవడం, రాష్ట్రమంతా చల్లదనంగా ఉండటంతో కాయలు తెంపేందుకు వేచి చూస్తున్న తరుణంలో ఒక వర్షం తర్వాత మరో వర్షం కురవడంతో పంట పూర్తిగా ధ్వంసమైంది.
విత్తన ఖర్చే రూ.35 వేలు
కర్బూజ(వాటర్ మిలన్), తర్బూజ(మస్క్‌మిలన్), జన్నత్(సూపర్ మార్కెట్ వైరెటీ) పండ్ల తోటలను సాగు చేశారు. మార్కెట్లో ఎప్పుడు ఏ ధర ఉంటుందో తెలియదు కాబట్టి.. సగటున ధర గిట్టుబాటయ్యేందుకు ప్రతి పంటను మూడు దఫాలుగా సాగు చేశారు. ఫిబ్రవరి నెలలో సాగు చేసిన పంట.. మండు వేసవిలో మే నెలలో చేతికందుతున్న తరుణంలోనే పూర్తిగా దెబ్బతింది. వీటికి సంబంధించిన 50 గ్రాముల విత్తనాలకే దాదాపు రూ.1,600 నుంచి 1,800 వరకు ధర ఉంటుంది. ఎకరాకు దాదాపు రూ.35వేలు ఖర్చు పెట్టి హైదరాబాద్, బెంగళూర్ నుంచి విత్తనాలు తెప్పించారు.
పంట పూర్తిగా నాశనం..
రైతులు సాగు చేసిన కర్బూజ కాయలు అమ్మకానికి వచ్చాయి. కాయలు తెంపే సమయంలోనే భారీ వర్షాలతో భూమిలో నీళ్లు ఆగాయి. వేరు వ్యవస్థ దెబ్బతిని కర్బూజ మొక్కలు వాడిపోయాయి. దీనికితోడు పూత రాలిపోయింది. అప్పటికే కాచిన కాయ లు కుచించుకుపోయాయి. పక్వానికి వచ్చిన కాయ ల్లో పురుగు చేరింది. దీనికితోడు రాళ్ల వానతో కాయ లు ఎక్కడికక్కడే పగిలిపోయి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఒక్కో ఎకరానికి రూ.3లక్షల నుంచి 4లక్షలు వస్తాయనుకుంటే.. కనీసం విత్తనాలకు పెట్టిన పెట్టుబడి కూడా రాలేదని కన్నీళ్లపర్యంతమవుతున్నారు. అకాల వర్షాలతో కర్బూజ వంటి కొత్త పంటలు పెట్టాలంటేనే రైతులు భయపడే పరిస్థితి నెలకొంది.

కర్బూజ రైతు నష్టాలపాలు