ఇల్లంతకుంట(మానకొండూర్): రాజన్నసిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం గొల్లపల్లిలో మంగళవారం పిడుగుపాటుకు గొర్రెలకాపరి మృతిచెందాడు. గ్రామానికి చెందిన దాసరి లక్ష్మణ్(21) గొర్రెలను మేత కోసం రేపాక శివారుకు తీసుకెళ్లాడు. మంగళవారం మధ్యాహ్నం ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడింది. ఆ సమయంలోనే చెట్టు కింద ఉన్న లక్ష్మణ్ పిడుగుపాటుకు గురై అక్కడికక్కడే మరణించాడు. అతనికి కొంతదూరంలో ఉన్న మరో కాపరి రాజు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఎస్సై శ్రీకాంత్‌గౌడ్ సంఘటన స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు.
తల్లీబిడ్డలకు గాయాలు
మల్యాల: జగిత్యాల జిల్లా మల్యాల మండలంలో మంగళవారం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. తాటిపల్లి గ్రామంలో ఎస్సీ కాలనీకి చెందిన జేరుపోతుల సుమలత ఇంటి సమీపంలో భారీ శబ్దంతో పిడుగుపడడంతో విద్యుత్ మీటరు కాలిపోయింది. ఇంటి లోపల గోడల పెచ్చులు ఊడిపోయాయి. విద్యుత్ పైపులు కాలిపోయి, స్విచ్‌బోర్డు పగిలిపోయింది. ఇంట్లో ఉన్న సుమలత చేతిపై మెరుపులు పడడంతో గాయాలయ్యాయి. ఆమె కూతురు ఆరాధ్య, కుమారుడు ఫ్రాన్సిస్ స్వల్పంగా గాయపడ్డారు. స్థానికులు వారిని 108లో జగిత్యాల ఆస్పత్రికి తరలించారు. పిడుగుపాటు శబ్దానికి సుమలతకు వినికిడి లోపం తలెత్తింది. మల్యాల ఎస్సై నరేశ్‌కుమార్, పోలీస్ సిబ్బంది సంఘటన స్థలానికి వెళ్లి వివరాలు సేకరించారు.
కాసారంలో గేదె మృతి..
గంగాధర: మండలంలోని కాసారం గ్రామంలో పిడుగుపాటుకు పాడిగేదె మృతి చెందిందని గ్రామస్తులు తెలిపారు. పెద్దిపల్లి తిరుపతి గేదెను పొలం వద్ద కట్టి వేయగా మంగళవారం సాయంత్రం పిడుగుపడి మృతి చెందింది. బాధిత రైతును ప్రభుత్వం ఆదుకోవాలని మాజీ సర్పంచు వేముల దామోదర్ కోరాడు.
నేలవాలిన వృక్షం
గన్నేరువరం: మండలకేంద్రంలోని చావిడి వద్ద భారీ వృక్షం మంగళవారం వీచిన గాలివానకు నేలవాలింది. ఆయుర్వేదిక్ ఆసుపత్రి, వాటర్ ప్లాంట్ సమీపంలోని వృక్షం నేలవాలడంతో పెను ప్రమాదం తప్పింది. పక్కనే గ్రామానికి చెందిన అరిగెల వరవ్వ, రామవ్వ నివాస గృహాలు ఉన్నాయి, చెట్టు కింద పడుతున్న సమయంలో భయాందోళనకు గురై ఇంట్లో నుంచి భయటకు పరుగులు తీశారు. ఇళ్ల మధ్య పడటంతో ఊపిరిపీల్చుకున్నారు. ఏళ్లనాటి వృక్షం నేలవాలిందని గ్రామస్తులు తెలిపారు. కాగా మండలంలో గంట పాటు భారీ వర్షం కురిసింది.