మానకొండూర్: ప్రభుత్వ పాఠశాలలో ట్యాబ్‌లు చోరీకి గురయ్యాయని ఫిర్యాదు చేసిన 24 గంటల్లోనే పోలీసులు కేసును ఛేదించారు. మానకొండూర్ సీఐ లక్ష్మీనారాయణ తెలిపిన వివరాలు.. మానకొండూర్ మండల కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాల నుంచి 23 ట్యాబ్‌లు దొంగలు ఎత్తుకెళ్లారని ఈ నెల 15న హెచ్‌ఎం శ్రీనివాస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటన స్థలాన్ని ఏసీపీ, సీఐ, క్లూస్‌టీం పోలీసులు పరిశీలించి కేసు దర్యాప్తు చేపట్టారు. ఇదే పాఠశాలలో చదువుతున్న విద్యార్థి దొంగతనానికి పాల్పడ్డాడని అనుమానించి ఆ కోణంలో విచారణ జరుపగా ట్యాబ్‌ల జాడ తెలిసింది. 15 రోజుల క్రితం ప్రార్థన సమయంలో ప్రధానోపాధ్యాయుడు ట్యాబ్‌లు చూపించగా, ఎలాగైన వాటిని దొంగిలించాలని అనుకున్న విద్యార్థి ఈనెల 13న పాఠశాలకు సెలవుపెట్టి ఇంటికి వెళ్తున్నట్లు చెప్పాడు. అదే రోజు రాత్రి పాఠశాల వెంటిలేటర్ పగులగొట్టి లోనికి ప్రవేశించాడు. 23 ట్యాబ్‌లను దొంగిలించి కొండపల్కల గ్రామ శివారులోని రాముని గుట్ట మీద దాచిపెట్టినట్లు విద్యార్థి తెలుపగా, పోలీసులు గుట్టపైకి వెళ్లి ట్యాబ్‌లు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేశామని సీఐ తెలిపారు.
24 గంటల్లో కేసును ఛేదించిన పోలీసులు