ముస్తాబాద్(సిరిసిల్ల): కూల్ డ్రింక్ అనుకుని పురుగుల మందు తాగిన వృద్ధురాలు చికిత్సపొందుతూ మృతిచెందింది. ఎస్సై గణేశ్, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. ముస్తాబాద్ మండలం పోతుగల్ గ్రామానికి చెందిన జెల్ల బాలవ్వ(74) శనివారం ఇంట్లో కూల్‌డ్రింక్ అనుకొని సీసాలోని పురుగుల మందు తాగి తీవ్ర అస్వస్థతకు గురైంది. గమనించిన కుటుంబ సభ్యులు బాలవ్వను ముస్తాబాద్‌లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో సిద్దిపేటలోని ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ అదేరోజు రాత్రి మృతిచెందింది. అయితే వరిపంటకు కొట్టగా మిగిలిన పురుగుల మందును కూల్ డ్రింక్ సీసాలో ఉంచారు. ఇది తెలియని బాలవ్వ కూల్ డ్రింక్ అనుకుని పురుగుల మందు తాగి మృతిచెందడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. కాగా 25 రోజుల క్రితమే అప్పుల బాధలు భరించలేక బాలవ్వ కుమారుడు దేవయ్య పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. 25 రోజుల వ్యవధిలో ఒకే ఇంట్లో ఇద్దరూ మరణించడంతో పోతుగల్‌లో విషాదం నెలకొంది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై గణేశ్ తెలిపారు.
చికిత్స పొందుతూ వృద్ధురాలు మృతి
25 రోజుల క్రితమే కుమారుడు ఆత్మహత్య