దమ్ముంటే కాంగ్రెస్‌ను టచ్‌ చేయండి - | Sakshi
Sakshi News home page

దమ్ముంటే కాంగ్రెస్‌ను టచ్‌ చేయండి

Published Sat, Apr 20 2024 1:45 AM

సిరిసిల్లలో మాట్లాడుతున్న మంత్రి పొన్నం ప్రభాకర్‌ - Sakshi

సిరిసిల్లటౌన్‌/కరీంనగర్‌ కార్పొరేషన్‌: అధికారం నుంచి ప్రజలు తిరస్కరించినా కేసీఆర్‌, కేటీఆర్‌లకు అహం పోలేదని, తమ ప్రభుత్వాన్ని కూల్చుతామంటుండ్రని.. దమ్ముంటే కాంగ్రెస్‌ను టచ్‌ చేయండని మంత్రి పొన్నం ప్రభాకర్‌ సవాల్‌ విసిరారు. సిరిసిల్లలో శుక్రవారం నిర్వహించిన నియోజకవర్గస్థాయి కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. బీఆర్‌ఎస్‌ పార్టీ పార్లమెంటు అభ్యర్థులుగా నిలబెట్టిన వారే ఆ పార్టీ అవినీతి, నియంతృత్వంపై ఛీత్కరించుకుంటూ పార్టీని వీడుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రజాపాలన అందించే కాంగ్రెస్‌పైనే ప్రజల ఆశీర్వాదం ఉందని స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీలేవీ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నెరవేర్చలేదన్నారు. ప్రజాస్వామ్య విలువలు తెలువనోళ్లు రాజకీయం చేస్తే.. ఇట్లానే ఉంటుందని బీఆర్‌ఎస్‌, బీజేపీలను ఉద్దేశించి విమర్శించారు. ఆ పార్టీల నియంతృత్వంపై ప్రజలు విసిగిపోయారని, రాహుల్‌ నేతృత్వంలో అందించే ప్రజాపాలనకే రానున్న ఎన్నికల్లో ప్రజలు పట్టం కడతారని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్‌, బీజేపీలు ఒక్కటై సిరిసిల్లకు కేటాయించిన మెగా టెక్స్‌టైల్‌ క్లస్టర్‌ను వరంగల్‌కు తరలించి ఇక్కడి కార్మికుల ఉసురు పోసుకున్నారని ధ్వజమెత్తారు. కరీంనగర్‌ నుంచి పార్టీ అభ్యర్థి గెలుపునకు కార్యకర్తలంతా సైనికుల్లా పనిచేయాలని కోరారు. ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌, ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం, స్థానిక నాయకులు నాగుల సత్యనారాయణగౌడ్‌, సంగీతం శ్రీనివాస్‌, చొప్పదండి ప్రకాశ్‌ తదితరులు పాల్గొన్నారు.

కూడబల్కొనే బీజేపీ, బీఆర్‌ఎస్‌ వ్యాఖ్యలు

కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ప్రభుత్వం కూలిపోతుందని బీఆర్‌ఎస్‌, బీజేపీ కూడబల్కొని చెబుతున్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. శుక్రవారం కరీంనగర్‌లో మాట్లాడారు. 20 మంది ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారంటూ కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. కేసీఆర్‌ అసహనంతో, పిచ్చిపట్టి మాట్లాడుతున్నారన్నారు. రైతుల సమస్యలు, ప్రభుత్వం కూలిపోవడం, రేవంత్‌రెడ్డి బీజేపీతో కలవడం..ఏ అంశమైనా ఈ రెండు పార్టీలు ఒకే మాట మాట్లాడుతున్నాయని, కుమ్మక్కుకు ఇదే నిదర్శనమన్నారు. ఉత్తర భారత్‌లో బలంగా ఉన్నామనుకొన్న బీజేపీ కోటలకు బీటలువారుతున్నాయని, అందుకే దక్షిణ భారత్‌ మీద అమిత్‌షా దృష్టి పెట్టారన్నారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో పనులు పూర్తి చేసి ఇవ్వాల్సిన టోకెన్‌ బిల్లులు రూ.40 వేల కోట్ల నుంచి రూ.50 వేల కోట్లున్నాయన్నారు. ఎన్నికలకు ముందు ప్రజలను సంతృప్తి పరచడానికి వందల జీవోలు తెచ్చారని పేర్కొన్నారు.

బీఆర్‌ఎస్‌ అభ్యర్థులే ఆ పార్టీని వీడుతున్నరు..

రాష్ట్ర విభజన హామీలేవీ బీజేపీ నెరవేర్చలేదు..

ప్రజలు కాంగ్రెస్‌ వైపే ఉన్నారు..

మంత్రి పొన్నం ప్రభాకర్‌

Advertisement
 
Advertisement
 
Advertisement