
భక్తులు.. రంగురంగుల విద్యుదీపాల వెలుగుల్లో వేములవాడ రాజన్న ఆలయం
● కాకతీయుల నుంచి కొనసాగుతున్న ఆచారం
● మేడారానికి ముందు వేములవాడ రాజన్న దర్శనం
● రోజూ 60 వేల మంది..
వారాంతాల్లో లక్ష దాటుతున్న సంఖ్య
● ఇప్పటివరకు దర్శించుకున్న 24లక్షల మంది
● రూ.21 కోట్లు దాటిన రాజన్న హుండీ ఆదాయం
సాక్షిప్రతినిధి,కరీంనగర్●:
దక్షిణ కుంభమేళాగా పిలిచే మేడారం సమ్మక్క–సారలమ్మ జాతర మొదలైంది. కోట్లాది భక్తుల కొంగు బంగారంగా పిలిచే సమ్మక్క జాతర ప్రారంభానికి ముందే రాజన్నను దర్శించుకునే ఆనవాయితీ అనాదిగా వస్తోంది. సాధారణ రోజుల్లో దక్షిణ కాశీగా పిలిచే వేములవాడ సందర్శించే భక్తుల సంఖ్య 20వేలకు అటూఇటూగా ఉంటుంది. కానీ, మేడారం జాతరకు ముందు వచ్చే సంక్రాంతి తరువాత అమాంతంగా ఈ సంఖ్య పెరుగుతుంది. గత సంక్రాంతి మరునాటి నుంచి రాజన్నకు భక్తుల తాకిడి మొదలైంది. జనవరి 16 నుంచి రోజుకు 60వేలకు పైగా భక్తులు రాజన్న వద్దకు వచ్చారు. అదే శని, ఆది, సోమవారాల్లో 80వేల నుంచి లక్ష వరకు భక్తులు ఆలయానికి పోటెత్తుతున్నారని ఆలయ అధికారులు వెల్లడిస్తున్నారు. ఇప్పటివరకు 24లక్షల మందికి పైగా భక్తులు రాజన్నకు తమ మొక్కులు సమర్పించుకున్నారని అంచనా.
నేపథ్యం?
ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన వేడుకగా సమ్మక్క–సారలమ్మ జాతర గుర్తింపు పొందింది. తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, కర్ణాటక, ఒడిశా, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి భక్తులు మేడారం వస్తారు. వీరిలో ముఖ్యంగా తెలంగాణ ఉత్తర భాగాన ఉన్న ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, మెదక్, ఖమ్మం జిల్లాల నుంచి మేడారానికి ముందు వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామిని దర్శించుకునే సంప్రదాయం 13వ శతాబ్దం నుంచి కొనసాగుతోంది. వాస్తవానికి కాకతీయ రాజుల్లో చివరి వాడైన ప్రతాప రుద్రునికి సమ్మక్క–సారలమ్మలకు యుద్ధం జరిగింది. కాకతీయులు శివుని భక్తులు. అందుకే తమ సామ్రాజ్యంలో శ్రీరాజరాజేశ్వరుని కులదైవంగా కొలుస్తూ అనేక ప్రదేశాల్లో ఆలయాలు నిర్మించారు. అలా కాకతీయ ప్రజలు కూడా ఏ పని తలపెట్టినా.. శ్రీరాజరాజేశ్వరుని మొక్కడం ఆనవాయితీగా వస్తోంది. అందుకే మేడారం జాతర ప్రారంభానికి ముందు నుంచి వేములవాడ రాజన్నను దర్శించుకోవడం ఉత్తర తెలంగాణ భక్తులకు సంప్రదాయంగా మారింది.
వారాంతాల్లో కిటకిట..
మేడారానికి ముందు వచ్చే భక్తులను నియంత్రించడం ఆలయ అధికారులకు కత్తి మీద సాములా ఉంటుంది. సాధారణ రోజుల్లో 20వేలుగా వచ్చే భక్తులు ఇప్పుడు మూడింతల రెట్టింపు అంటే 60వేలకు పైగా వస్తున్నారు. అదే వారాంతాలు శని, ఆది, సోమవారాల్లో దర్శనానికి రాష్ట్రవ్యాప్తంగా లక్ష మందికి పైగా శివుని భక్తులు పోటెత్తుతున్నారు. అయినా వారికి సౌకర్యాల కల్పనలో ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక మేడారానికి ముందు రాజన్న వద్దకు వచ్చిన భక్తులు స్వామివారికి సమర్పించుకున్న కానుకలు కూడా భారీస్థాయిలో ఉండటం గమనార్హం. జనవరి 16 నుంచి ఫిబ్రవరి 20 వరకు భక్తులు రాజన్నకు సమర్పించిన కానుకల విలువ రూ.21కోట్లు దాటిందని అధికారులు అంచనా వేస్తున్నారు. మేడారం జాతర ముగిసే సమయానికి రాజన్న హుండీ ఆదాయం మరింత పెరిగే అవకాశముంది.