
కొత్తపల్లి(కరీంనగర్): విద్యుత్ శాఖలో మీటర్ల అక్రమ దందాపై ఉన్నతాధికారులు స్పందించారు. అనుమతి ఒకచోట.. బిగింపు మరోచోట.. పంచాయతీ అనుమతి లేకున్నా మీటర్ల మంజూరు.. అధికారుల పర్యవేక్షణ లోపం.. లైన్‌మెన్ల మాయాజాలం పేరిట సాక్షిలో బుధవారం ప్రచురితమైన కథనంపై కరీంనగర్ రూరల్ ఏడీఈ కొలుపుల రాజు విచారణ చేపట్టారు. కొత్తపల్లి సెక్షన్ పరిధి సీతారాంపూర్‌లోని 2–136 ఇంటి నెంబర్‌పై మంజూరైన ఎస్‌ఎంపీ–4102 నెంబర్ గల మీటర్‌ను మున్సిపల్ అనుమతి లేని, కోర్టు పరిధిలో ఉన్న స్థలంలో నిర్మించిన షెడ్డుకు బిగించారని ఫిర్యాదు చేసిన కొట్టె వినయ్ స్టేట్‌మెంట్‌ను రికార్డు చేశారు. ఇంటి నెంబర్ సరైనదా.. కాదా అన్న విషయంపై తెలుసుకునేందుకు మున్సిపల్ శాఖకు, వినియోగదారుడికి నోటీసు ఇవ్వనున్నట్లు ఏడీఈ తెలిపారు. కమాన్‌పూర్‌లో పంచాయతీ అనుమతి లేకుండా నిర్మిస్తున్న అక్రమ కట్టడాలకు మంజూరు చేసిన మీటర్లపై విచారణ చేపట్టాలని ఏఈను ఆదేశించినట్లు చెప్పారు. నిబంధనల ప్రకారం పంచాయతీ అనుమతులతో మీటర్‌ను పొందితే సరేనని, లేకుంటే వినియోగదారులకు నోటీసులిచ్చి, పంచాయతీ కార్యదర్శి ఇదివరకు జారీ చేసిన నోటీసుల ప్రకారం విద్యుత్ కనెక్షన్ తొలగిస్తామని ఏడీఈ పేర్కొన్నారు.