● పొద్దున పోతే రాత్రయ్యాకే ఇంటికి.. ● నిత్యం కుటుంబంలో గొడవ ● ఎన్నికల ప్రచారం నేపథ్యంలో చోటామోటా నాయకుల తిప్పలు
● లక్ష్మి: అనుకున్న.. ఇయ్యాల ఆ దరిద్రపు ఫోన్ ఇంకా వస్తలేదని.. రానే వచ్చింది. ఇగ ఇప్పుడు పోతే.. ఏ వేళకు ఇంటికి వస్తవో?
గంగాధర్: అవ్.. లక్ష్మి.. మా పార్టీ పెద్ద మనిషి ఫోన్ చేసిండు. ఇయ్యాల మన పక్క ఊరిలో ప్రచారమట. ఏడు వరకే ఉండమన్నడు.. నువ్ పొద్దున్నే లేపొద్దా?
● లక్ష్మి: గీ ఫోన్.. పదిహేను రోజుల నుంచి గిట్లనే వస్తుంది. పొద్దుగాల ఏడు కావాల.. ఎవరో ఒకరు ఫోన్ చెయ్యాల.. పార్టీ మీటింగ్‌లు.. ప్రచారం అనుకుంట నువ్ పొద్దుమాపు తిరిగి అర్ధరాత్రి వేళ ఇంటికి రావాలె..
గంగాధర్: మరి ఏందనుకున్నవే లీడర్ అంటే.. మా పార్టీ పెద్ద మనిషికి నేను లేకుంటే నడ్వదు. అన్ని ఊళ్లకు నన్నే పిలుస్తడు. ఈసారి ఆయన ఎంబడి ఉండి, గట్టిగా తిరిగి ఎట్లన్న జేసి, పార్టీని గెలిపించుకోవాలె.
● లక్ష్మి: అవ్ మల్ల. మీ పార్టీని గెలిపించుకోవడానికి మస్తు తిరుగుతున్నవ్.. కానీ ఇంటి సంగతేంది. ఇంట్ల ఏమన్న ఉన్నదా.. లేదా చూసుకోవాల్నా.. లేదా?
గంగాధర్: అగో.. మొన్ననే ఇంట్లకు అన్ని తెచ్చిపెడితిని కదా.. ఇంకేం కావాలా.. ఎప్పుడు గిదే లొల్లి.. ఏం పనిచేసుకోనియ్యవ్.
● లక్ష్మి: మొన్న తెచ్చినవా? ఎన్ని రోజులవుతుందో.. ఏమన్నా కాల్లి ఉన్నదా నీకు? పొద్దుగాల లేసి పార్టీ.. పార్టీ అనుకుంట పోతున్నవ్. ఇంటి సామాన్లు తెచ్చి, ఇరవై రోజులైంది. అప్పటి నుంచి ఏం పట్టించుకుంటలేవ్.. నేను ఎట్ల ఎల్లదియ్యాలె?
గంగాధర్: అరే.. గిదేం లొల్లి మోపుజేసినవే? ఆడ మా పార్టీ గెలుస్తదా.. లేదా అని మేం పరేషాన్‌లో ఉన్నం.. నువ్వేమో గిట్ల తలిగినవ్.
● లక్ష్మి: అవ్ మరి.. పదిహేను రోజుల నుంచి పొద్దుగాల లేచి టిఫిన్ కాడికెళ్లి బిర్యానీ దాకా బయట తిని, రాత్రి పూట మంచిగ తాగి వస్తున్నవ్.. నీకేం తెలుస్తయ్ ఇంట్ల నా తిప్పలు. బడి సారు చిన్నపోరని ఫీజు పైసలు కట్టమని అడిగితే పక్కింటి సరోజను అడిగి తెచ్చి, కట్టిన. పెద్ద పిల్ల బడిలో టూర్ పోతున్నరని 2 వేలు కావాలని చెప్పింది. ఇంట్లో కిరాణా సామాను అయిపోయింది. గివన్నీ జెప్తమంటే.. పొద్దుగాల్నే ఫోన్ రావట్టే.. బిరబిర ఉర్కవడితివి.
గంగాధర్: సరేగానీ అవన్నీ నేను చూసుకుంట.. మా సారు గెలుస్తే గీ తిప్పలే ఉండవ్.. జల్ది చాయ్ పెట్టు. నేను పోవాలా.. మీటింగ్‌కు లేటవుతుంది.. నా కోసం కారు ఆపిండ్రు.
● లక్ష్మి: చాయ్ పెట్టాల్నా.. ఎట్ల పెట్టాలె? పాల నారాయణ పైసలు ఇవ్వలేదని పాలు పోసు డు బంజేసిండు. చాపత్త లేదు. చెక్కరి అయిపోయింది. పో.. పో అక్కడ నీ కోసం చూస్తున్నరు కదా. వాళ్లే నీకు చాయ్, మందు అన్నీ పోస్తరు. నేను ఎట్లనో బాకీలు చేసి, తిప్పలు వడ్త.
● ‘సరే.. సరేలే.. నేను ఇయ్యాల జల్ది వస్తా.. అన్నీ తెస్తా.. అని చెప్పుకుంట గంగాధర్ బండి తీసుకొని ఇంట్లకెళ్లి, బయటవడ్డడు.
● నిజంగా జల్ది వస్తడంటారా? ఎన్నికలు ము గిసేదాకా ఇల్లూవాకిలి పట్టించుకోకుండా గి ట్లనే తిరుగుతడా.. అనేది మనకు బేతాళ ప్రశ్న. ఇదీ ఎన్నికల సమయంలో చోటామోటా లీడర్ల ఇళ్లల్లోని ఇంటి పోరు తీరు.
కోరుట్ల: పొద్దుగాల.. ఏడు గంటల సమయం. ఊరి చోటా లీడర్ గంగాధర్ ఫోన్ ట్రింగ్.. ట్రింగ్ అని మోగుతోంది. రాత్రి ఇంటికి లేటుగా వచ్చిన అతను అబ్బా.. అని మత్తు వదిలించుకుంటూ మంచం మీద నుంచి లేచి ఫోన్ ఎత్తాడు. అన్నా ఇగో.. రెండు నిమిషాల్లో వస్తున్నా.. హోటల్ కాడ ఉండుండ్రి.. అని చెప్పి, పెట్టేసిండో లేదో.. ఇంటి పోరు మొదలైంది. గంగాధర్ భార్య లక్ష్మి ఒక్కసారిగా మాటల జోరు పెంచింది. అది హోరుగా మారింది. ఇంతకీ ఆ ఇంటి మహాలక్ష్మి మాటల జోరేంది.. ఆ ముచ్చటేంది.. ఓసారి తెలుసుకుందాం.