
వన్ టౌన్ ఎదుట అసంపూర్తిగా జంక్షన్
కరీంనగర్ కార్పొరేషన్: నగరపాలకసంస్థలో ఆ కాంట్రాక్టర్ హవా అంతా ఇంతా కాదు. ఒకరిద్దరు అధికారులు తోడుగా తాను ఎప్పుడు చేస్తే అప్పుడే పని.. ఏది చేస్తే అదేపని.. ఎలా చేస్తే అదే నాణ్యత...అన్న రీతిలో పరిస్థితి తయారైంది. స్మార్ట్‌సిటీలో భాగంగా వేల కోట్లరూపాయలతో సిటీలో అభివృద్ధి పనులు చేపట్టారు. ఆధునీకికరణ, సుందరీకరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. కానీ కొంతమంది కాంట్రాక్టర్ల అక్రమాలు, గడువుమీరినా పనులు పూర్తి చేయకపోవడం, అసలు పనులే మొదలు పెట్టకపోవడం లాంటి చర్యలతో లక్ష్యానికి తూట్లు పొడిచే ప్రయత్నం చేస్తున్నారు.
నత్తనడకన జంక్షన్లు
► నగరంలోని తెలంగాణ చౌక్, గాంధీ జంక్షన్, వన్‌టౌన్ పోలీసు స్టేషన్ ఎదురుగా ఉన్న జంక్షన్, బొమ్మకల్ బైపాస్ చౌరస్తా ఆధునీకీకరణ పనులను కాంట్రాక్ట్‌లను మాధవ కన్‌స్ట్రక్షన్ గతంలో సొంతం చేసుకొంది. ఇందులో కొన్ని జంక్షన్‌ల పనులు పూర్తి చేయగా, మరికొన్ని జంక్షన్‌ల పనులు నత్తనడకన సాగుతున్నాయి.
► చేసిన పనులపైనా ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నా సంబంధిత కాంట్రాక్టర్‌పై చర్య తీసుకోవడానికి అధికారులు వెనుకడుగు వేస్తుండడం పలు అనుమానాలకు తావునిస్తోంది. కిసాన్‌నగర్‌లోని గాంధీ జంక్షన్ వద్ద వేసిన బోర్‌వెల్ ఎంబీ రికార్డ్ నగరంలో జరుగుతున్న అవినీతి ఏ విధంగా సాగుతుందో ఉదహరించింది.
► 715 ఫీట్లు బోరువెల్, 492 ఫీట్లు కేసింగ్ వేసిన ట్లు అందులో చూపిన కాకిలెక్కలు కలకలం సృష్టించాయి. ఈ వ్యవహారంపై ఈ నెల 7వ తేదీన ‘అవినీతి గోతులు గాంధీకే ఎరుక’ పేరిట ‘సాక్షి’లో వచ్చిన కథనం సంచలనం సృష్టించింది.
► ఇప్పటివరకు సంబంధిత వ్యవహారంపై చర్యలు తీసుకొన్న దాఖలాలు లేవు. అక్రమాలు బయట పడ్డా ఒకరిద్దరు అధికారులు వారిని కాపాడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
► ఇదిలాఉంటే తెలంగాణచౌక్ జంక్షన్‌తో పాటు ఇతరత్రా పనుల్లో అక్రమాలు చోటుచేసుకున్నాయని, విచారణ నిర్వహించాలని గతంలో బీఆర్‌ఎస్ కార్పొరేటర్ బండారి వేణు ఫిర్యాదు చేయడం తెలిసిందే.
► దీనితో పాటు వన్‌టౌన్ పోలీసు స్టేషన్ జంక్షన్, బొమ్మకల్ బైపాస్ జంక్షన్ పనులు ఇప్పటివరకు పూర్తి కాలేదు. పునాదులతోనే రెండు జంక్షన్‌ల పనులు సరిపెట్టారు. ఇతరత్రా జంక్షన్‌ల పనులు వేగంగా పూర్తవుతుండగా, సదరు కన్‌స్ట్రక్షన్ పనులు మందకొడిగా సాగుతుండడం గమనార్హం.
► ఆరు నెలల్లో ఈ రెండు జంక్షన్‌లను పూర్తి చేయాల్సి ఉండగా, గడువు ముగిసిపోయి నెలలు గడిచినా సగం పనులు కూడా కాలేదు. అక్రమాలకు పాల్పడినట్లు తేలినా, గడువులోగా పనులు పూర్తి చేయకపోయినా, ఫిర్యాదులు వచ్చినా..సదరు కాంట్రాక్టర్‌పై ఎలాంటి చర్యలు లేకపోవడం చర్చనీయాంశంగా మారింది.
నోటీసు ఇచ్చాం
బొమ్మకల్ బైపాస్ జంక్షన్, వన్‌టౌన్ పోలీసు స్టేషన్ ముందు జంక్షన్ పనులు పూర్తిచేయడంలో అలసత్వం వహిస్తున్నందుకు మాధవ కన్‌స్ట్రక్షన్‌కు నోటీసు ఇచ్చాం. ఆరు నెలల్లో పూర్తి చేయాల్సి ఉంది. గడువులోగా పనులు చేయనందుకు హెచ్చరించాం. పునాది స్థాయిలో పనులు సాగుతున్నాయి.
– కిష్టప్ప, ఈఈ, నగరపాలకసంస్థ