
లక్ష్మీపూర్‌లో సీఎం కేసీఆర్ పర్యటన ఏర్పాట్లను పరిశీలిస్తున్న కలెక్టర్ కర్ణన్, సీపీ సుబ్బారాయుడు
సాక్షి ప్రతినిధి, కరీంనగర్/రామడుగు: ఇటీవల కురిసిన వడగండ్ల వానలతో తీవ్రంగా నష్టపోయి న రైతులను పరామర్శించేందుకు ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు జిల్లాలో గురువారం పర్యటించనున్నారు. చొప్పదండి నియోజకవర్గంలోని రామడుగు మండలం లక్ష్మీపూర్‌లో సీఎం పర్యటించనున్నారని అధికారులు వెల్లడించారు. జిల్లాలోని 12మండలాల్లో అకాలవర్షాలతో దాదాపు 14వేల ఎకరాలలో రూ.100కోట్ల వరకు నష్టం జరిగి ఉండవచ్చని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. ముఖ్యంగా రామడుగు మండలంలో పంటల మార్పిడిలో భాగంగా ఇటీవల వేసిన పలు వాణిజ్య పంటలైన మస్క్‌మిలాన్, డ్రాగన్‌ఫ్రూట్, ఖర్బూజ, మామిడితోపాటు టమాట, బీర, కాకర, మిర్చి, పాలకూర, బెండ దారుణంగా దెబ్బతిన్నాయి. మొత్తంగా చొప్పదండి నియోజకవర్గంలో దాదాపు మూడు వేల ఎకరాలకుపైగా పంటలు దెబ్బతిన్నాయని సమాచారం.
మధ్యాహ్నం సీఎం పర్యటన
● గురువారం మధ్యాహ్నం అనంతరం రామడుగుకు హెలిక్యాప్టర్‌లో చేరుకుంటారు. రామచంద్రపూర్, చిప్పకుర్తి, లక్ష్మీపూర్ గ్రామాలకు రోడ్డు మార్గాన వెళ్తారు. అక్కడ వడగండ్ల కారణంగా దెబ్బతిన్న పంటలు పరిశీలిస్తారు.
● అనంతరం రైతులతో మాట్లాడి తిరిగి అక్కడ నుంచే హెలిక్యాప్టర్‌లో హైదరాబాద్‌కు వెళ్తారని అధికారులు వివరించారు. మరో వైపు సీఎం పర్యటన సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.
● పోలీసు కమిషనర్ సుబ్బారాయుడు నేతృత్వంలో పోలీసులు సమావేశం నిర్వహించా రు. ట్రాఫిక్, భద్రతలపై చర్చించారు. సీఎంకు నిరసనలు తెలిపే అవకాశం ఉందన్న కొందరునేతలను ముందస్తుగా హౌస్‌అరెస్టుచేసే యోచనలో ఉన్నారని సమాచారం.
● కలెక్టర్ కర్ణన్ కూడా ఏర్పాట్లు పర్యవేక్షించారు. లక్ష్మీపూర్ గాయత్రీ పంపుహౌజ్ వద్ద ఉన్న హెలిప్యాడ్ వద్ద ఏర్పాట్లు పరిశీలించారు. సీఎం పర్యటన నేపథ్యంలో రామడుగు మండలంలోని అకాల వర్షాల ప్రభావిత గ్రామాలలో బుధవారం పంటలను పరిశీలించి, రైతులతో మాట్లాడారు.
● జిల్లా వ్యాప్తంగా దాదాపు 14వేల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిన నేపథ్యంలో తమను ఎలాగైనా ఆదుకోవాలని రైతాంగం విన్నవిస్తోంది. ఆరుగాలం శ్రమించిన పంట, పెట్టుబడి మొత్తం అకాల వర్షం దెబ్బకు కొట్టుకుపోయాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పంట వడగండ్ల పాలైంది
మరోవారం రోజుల్లో మార్కెట్‌కు తరలించాల్సిన మస్క్ మిలాన్, కర్భూజ పంటలు కళ్ల ముందే వడగండ్ల వర్షంతో పాడైపోయాయి. దాదాపుగా రూ.12 లక్షల పెట్టుబడి పెట్టి మస్క్ మిలాన్ 10 ఎకరాల్లో సాగు చేశాను. 4ఎకరాలలో కర్భూజ, 6 ఎకరాల్లో డ్రాగన్‌ప్రూట్, పది ఎకరాలలో వరి సాగు చేశాను. వడగండ్లతో నాకు రూ.కోటిపైగా నష్టం వచ్చింది. ప్రభుత్వం పరిహారం అందించి ఆదుకోవాలి.
– ద్యావ రాంచెంద్రారెడ్డి, రైతు, లక్ష్మీపూర్
కూరగాయల పంటలకు దెబ్బ
టమాట, బీర, కాకర, మిర్చి, పాలకూర, బెండకాయ కూరగాయల పంటలను మూడు ఎకరాలలో సాగు చేశాను. వడగండ్ల వర్షంతో పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. పదిహేను రోజులైతే కూరగాయలు మార్కెట్‌కు తీసుకెళ్లే వాడ్ని. పెట్టుబడి రూ.70వేలు పెట్టిన. రూ.నాలుగు లక్షల నుంచి ఐదు లక్షల వరకు నష్టం వచ్చింది. ప్రభుత్వం పరిహారం అందించి అందుకుంటే రుణపడి ఉంటాం.
నారెడ్డి మధుకర్‌రెడ్డి, రైతు, లక్ష్మీపూర్
మామిడి మొత్తం రాలింది
ఎనిమిది ఎకరాలలో మామిడి తోట మంచిగా కాపు వచ్చింది. ఈ సారి మంచి ఫలితాలు ఉంటాయనుకుంటే అకాలవర్షం నిండా ముంచింది. తోటలో మామిడి కాయలు 70శాతం వరకు రాళ్ల దెబ్బలకు రాలిపోయాయి. వడగండ్ల వర్షం తీరని నష్టం చేసిపోయింది. ప్రభుత్వమైన మాపైన దయ చూపి పరిహారం అందించాలి.
– బాపురెడ్డి, రైతు, లక్ష్మీపూర్
నేడు సీఎం కేసీఆర్ జిల్లా పర్యటన
రామడుగు మండలంలోని పలు గ్రామాల్లో..
దెబ్బతిన్న పంటలను పరిశీలించనున్న ముఖ్యమంత్రి
బాధిత రైతులతో మాట్లాడనున్న చంద్రశేఖర్‌రావు
ఏర్పాట్లు పర్యవేక్షించిన కలెక్టర్, పోలీస్ కమిషనర్
మంత్రి గంగుల సమీక్ష
సీఎం కేసీఆర్ పర్యటనకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో సమీక్షించారు. రామడుగు మండలంలో పంటనష్టాన్ని పరిశీలించడానికి సీఎం కేసీఆర్ రానున్న నేపథ్యంలో పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. రామడుగు మండలంతో పాటు జిల్లావ్యాప్తంగా జరిగిన పంటనష్ట నివేదికను సిద్ధం చేయాలని ఆదేశించారు. రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయిన్‌పల్లి వినోద్ కుమార్, చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, మేయర్ సునీల్‌రావు, జెడ్పీ చైర్‌పర్సన్ కనుమల్ల విజయ, కలెక్టర్ కర్ణన్, సీపీ సుబ్బారాయుడు ఉన్నారు.



