● ‘ఉపాధి’ పర్యవేక్షణ కోసం
త్వరలో ఏర్పాటుకు చర్యలు
ఎల్లారెడ్డిరూరల్: ఉపాధి హామీ పథకంలో నిధుల దుర్వినియోగానికి చెక్ పెట్టడం లక్ష్యంగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ పథకంలో పారదర్శకత కోసం కొత్తగా గ్రామాల వారీగా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ(వీఎంసీ)లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
జిల్లాలో 2.15 లక్షల మంది కూలీలు..
జిల్లాలో 1.36 లక్షల జాబ్ కార్డులు ఉండగా.. వీటి పరిధిలో 2.15 లక్షల మంది యాక్టివ్ కూలీలున్నారు. ప్రతి గ్రామంలో ఉపాధిహామీ పనులు జరుగుతున్నాయి. ఏటా సామాజిక తనిఖీల సమయంలో అవినీతి వెలుగుచూస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో ఉపాధి హామీ పనులలో అవినీతి జరగకుండా ఉండేందుకుగాను గ్రామస్థాయిలో విజిలెన్స్ మానిటరింగ్ కమిటీలను ఏర్పాటు చేయడానికి కసరత్తు చేస్తున్నారు.
ప్రతి కమిటీలో ఐదుగురు సభ్యులు...
గ్రామస్థాయి విజిలెన్స్ మానిటరింగ్ కమిటీలో ఐ దుగురు సభ్యులు ఉండనున్నారు. సగం మంది మహిళలు ఉండేలా కమిటీని ఎంపిక చేయనున్నారు. ఉపాధ్యాయులు, అంగన్‌వాడీ టీచర్, మహిళా సంఘం సభ్యులు, యువజన సంఘాల సభ్యులు, సోషల్ అడిట్ వ్యక్తులు సభ్యులుగా ఉండనున్నారు. గ్రామ సభల ద్వారా ఎన్నుకున్న కమిటీ ఆరు నెలల పాటు పని చేస్తుంది. విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ ఉపాధిహామీ పనులు జరుగుతున్న ప్రదేశానికి వెళ్లి పనులు జరుగుతున్న తీరు, కూలీల హాజరు, కూలీలకు చెల్లింపులు తదితర అంశాలను పరిశీలించాల్సి ఉంటుంది. అనంతరం వారి నివేదికలను సామాజిక తనిఖీ అధికారులకు అప్పగిస్తారు. ప్రతి గ్రామంలో ఉపాధిహామీ పనులు సక్రమంగా జరిగేందుకు, పనులను పర్యవేక్షించేందుకు త్వరలో గ్రామస్థాయి విజిలెన్స్ మానిటరింగ్ కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు ఎల్లారెడ్డి ఎంపీడీవో తాహేరా బేగం తెలిపారు.


