వెన్ను విరుస్తున్న వాన! | - | Sakshi
Sakshi News home page

వెన్ను విరుస్తున్న వాన!

Apr 6 2026 7:48 AM | Updated on Apr 6 2026 7:48 AM

వెన్ను విరుస్తున్న వాన!

దెబ్బతిన్న పంటలు

అకాల వర్షాలు అన్నదాతలను వెన్నాడుతున్నాయి. వానాకాలం సీజన్‌లో కురిసిన అకాల వర్షాలతో పంటలు దెబ్బతిన్నాయి. యాసంగిలో వడగళ్ల వానలు ఇబ్బందిపెడుతున్నాయి. దీంతో ఆరుగాలం శ్రమించే రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది.

– సాక్షి ప్రతినిధి, కామారెడ్డి

కాల వర్షాలు రైతులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. గతేడాది ఆగస్టు నెలాఖరులో కురిసిన భారీ వర్షాలతో జిల్లాలో 28 వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. ఆ దెబ్బ నుంచి కోలుకోకముందే యాసంగి సీజన్‌లో వడగళ్ల వానలు వెన్నాడుతున్నాయి. ఇటీవల భిక్కనూరు మండలంలో కురిసిన వర్షాలతో మొక్కజొన్న పంట నేలకొరిగింది. రెండు మూడు రోజులుగా జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలు, వడగళ్లు, బలమైన గాలులతో పంటలకు నష్టం జరుగుతోంది. మద్నూర్‌, తాడ్వాయి, కామారెడ్డి, పాల్వంచ, బీబీపేట, దోమకొండ, రాజంపేట, లింగంపేట, ఎల్లారెడ్డి, బాన్సువాడ, గాంధారి తదితర మండలాల్లో అక్కడక్కడా వడగళ్లు, కొన్ని చోట్ల గాలి వేగంగా రావడంతో పంటలు దెబ్బతిన్నాయి. మద్నూర్‌లో బొప్పాయి పంట దెబ్బతింది. తాడ్వాయి మండలంలో మొక్కజొన్న నేలవాలింది. కొన్నిచోట్ల వరి పంటకు నష్టం వాటిల్లింది.

వరి, మక్కలకు నష్టం..

చాలా చోట్ల వరి పంట కోతకొచ్చింది. కొన్ని ప్రాంతాల్లో పొట్టదశలో ఉంది. అలాగే మొక్కజొన్న పంట కూడా కోతకొచ్చింది. భారీ వర్షాలు, వడగళ్ల మూలంగా ఆయా పంటలకు ప్రమాదం పొంచి వుంది. ఆరుగాలం కష్టపడుతున్న రైతులను అకాల వర్షాలు, వడగళ్లు దెబ్బతీస్తున్నాయి. ప్రభుత్వాలు పంటలకు బీమా కల్పించకపోవడంతో ఏటా ప్రకృతి సృష్టిస్తున్న విధ్వంసంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.

ఆదుకోని ప్రభుత్వం..

జిల్లాలో గతేడాది ఆగస్టు నెలాఖరులో కురిసిన భారీ వర్షాలు రైతులకు తీవ్రనష్టం కలిగించాయి. దాదాపు 28 వేల ఎకరాలో పంటలు దెబ్బతినడంతో రైతులకు రూ. 50 కోట్లకు పైగా నష్టం వాటిల్లింది. గతంలో పంటలు దెబ్బతిన్నపుడు ప్రభుత్వం సాయం అందించి ఆదుకునేది. అయితే గతేడాది జిల్లాలో దెబ్బతిన్న పంటలకు ఇప్పటికీ పరిహారం అందలేదు. ప్రభుత్వ లెక్కల ప్రకారమే రైతులకు దాదాపు రూ. 30 కోట్ల మేర సాయం అందాల్సి ఉంది. ఇప్పటి వరకు దాని ఊసే లేదు. పంట నష్టాన్ని స్వయంగా సీఎం రేవంత్‌రెడ్డి పరిశీలించి వెళ్లినప్పటికీ రైతులకు నయాపైసా సాయం అందకపోవడం గమనార్హం. ప్రస్తుత యాసంగిలోనూ వర్షాలు దెబ్బతీస్తున్నాయి. ప్రకృతి విపత్తులతో పంటలు దెబ్బతిని రైతులు నష్టపోయినపుడు ప్రభుత్వాలు ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.

తాడ్వాయి/మద్నూర్‌: తాడ్వాయి, మద్నూర్‌ మండలాల్లోని పలు గ్రామాలలో శనివారం రాత్రి బలమైన గాలులతో కూడిన వర్షం కురిసింది. కొడిచిర, చిన్న ఎక్లార శివారులోని మక్క, జొన్న పంటలతోపాటు బొప్పాయి తోటలకు నష్టం వాటిల్లింది. తాడ్వాయి మండలంలో సుమారు 500 ఎకరాల విస్తీర్ణంలోని మక్క, జొన్న, గోధుమ, కూరగాయల పంటలు దెబ్బతిన్నాయి. మామిడి కాయలు రాలిపోయాయి. బాధిత రైతులను సర్కారు ఆదుకోవాలని కోరుతున్నారు.

ప్రతి సీజన్‌లో అకాల

వర్షాలతో ఇబ్బందులు

వానాకాలంలో నిండా ముంచిన

వరుణుడు

యాసంగిని వెన్నాడుతున్న వడగళ్లు

పంటలు దెబ్బతిని నష్టపోతున్న రైతులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement