● యోగా దివస్ సందర్భంగా
యోగా గీత్ జింగిల్ కాంటెస్ట్
● టాప్10లో నిలిచిన వారికి
బహుమతులు ఇస్తామన్న కేంద్రం
ఎల్లారెడ్డి: యోగాపై అవగాహన కల్పించేందుకు ఆయుష్ మంత్రిత్వ శాఖ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. పాట పాడినా, రీల్ చేసినా బహుమతి ఇస్తామని ప్రకటించింది. దేశంలోని సృజనాత్మకత ఆలోచనలు కలిగిన పౌరులకు యోగా గీత్ జింగిల్ కాంటెస్ట్ పేరిట గీతాల పోటీ, యోగా రీల్ కాంటెస్ట్ పేరిట రీల్స్ పోటీ నిర్వహిస్తోంది. కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ, మైగవ్ పోర్టల్ సంయుక్తంగా ఈ పోటీలు నిర్వహిస్తున్నాయి. 18 ఏళ్లు నిండిన భారతీయ పౌరులందరు ఈ పోటీలలో పాల్గొనడానికి అర్హులు. ఏప్రిల్ 20వ తేదీ సాయంత్రం 5.30 గంటల వరకు మైగవ్ పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ పోటీల్లో పొల్గొనేందుకు ఎలాంటి ప్రవేశ రుసుము లేదు.
పాటకు రూ. 50 వేలు..
యోగా గీత్ జింగిల్ కాంటెస్ట్‌లో యోగా ప్రాముఖ్యతను తెలుపుతూ జింగిల్స్‌ను, గీతాలను రూపొందించాల్సి ఉంటుంది. యోగా ప్రాముఖ్యతను తెలియపరిచేలా 25 నుంచి 30 సెకన్ల ఆడియో గీతాన్ని కానీ జింగిల్‌ను కానీ రూపొందించి మైగవ్ పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాలి. ఇది పూర్తిగా సొంతంగా కంపోజ్ చేసినదై ఉండాలి. కాపీరైట్ ఉన్న సంగీతాన్ని లేదా కంటెంట్‌ను ఉపయోగించకూడదు. ప్రజలకు సులభంగా అర్థమయ్యేలా పాడుకోవడానికి అనువుగా ఉండాలి. తెలుగు సహా అన్ని భారతీయ భాషల్లో గీతాలను రూపొందించవచ్చు. ఈ కాంటెస్ట్‌లో టాప్ 10లో చోటు సంపాదించినవారికి అందరికీ రూ. 50 వేల చొప్పున నగదు పారితోషికం ఇస్తామని ఆయుష్ మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
రీల్‌కు రూ. 10 వేలు..
యోగా రీల్ కాంటెస్ట్‌లో పాల్గొనేవారు రీల్స్ రూపొందించాల్సి ఉంటుంది. యోగా ప్రాముఖ్యతను వివరిస్తూ ఒక నిమిషం నుంచి 90 సెకన్ల నిడివి గల రీల్స్ రూపొందించాలి. దీనిని ఎంపీ4 ఫార్మాట్లోనే తీయాలి. మొబైల్ ఫోన్‌లో తీసేటప్పుడు పోర్ర్‌టెయిట్ మోడ్‌లో (9:16) రేషియోలో స్పష్టమైన రిజల్యూషన్‌లో ఉండాలి. రీల్ కచ్చితంగా సొంతంగా రూపొందించినదై ఉండాలి. గతంలో ఎక్కడా ఆ రీల్ ప్రసారమై ఉండకూడదు. పోటీ దారులు తాము చేసిన రీల్‌ను నేరుగా అప్‌లోడ్ చేయకుండా మైగవ్ పోర్టల్‌లో లింక్ సమర్పించాల్సి ఉంటుంది. ఏ భారతీయ భాషల్లో నైనా చేయవచ్చు సబ్ టైటిల్స్ ఉంటే మంచిది. ఈ కాంటెస్ట్‌లోనూ టాప్ 10లో నిలిచినవారందరికీ రూ. 10 వేల చొప్పున నగదు బహుమతి ఇవ్వనున్నారు.


