నిజాంసాగర్ : జిల్లాలో పండుగలు, జాతరల సమయంలో కుస్తీ పోటీలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. హోలీ, ఉగాది, శ్రీరామ నవమి, హనుమాన్ జయంతి ఉత్సవాలతోపాటు ఎల్లమ్మ, నల్లపోచమ్మ, ముత్యాల పోచమ్మ, మత్తడి పోచమ్మ ఆలయాల ఉత్సవాలలో భాగంగా పలు ప్రాంతాలలో కుస్తీ పోటీలు నిర్వహిస్తుంటారు. ఇవి ఉత్సాహంగా సాగుతున్నాయి. చుట్టుపక్కల ప్రాంతాలవారే కాకుండా.. వివిధ రాష్ట్రాలకు చెందిన మల్లయోధులూ పోటీలలో పాల్గొంటున్నారు. ప్రధానంగా జుక్కల్ నియోజకవర్గం కుస్తీ పోటీలకు కేరాఫ్‌గా నిలుస్తోంది. రోజూ ఏదో ఒక గ్రామంలో పోటీలు జరుగుతున్నాయి. గ్రామ కమిటీలతో పాటు ఆలయ కమిటీలు, సర్పంచులు, ప్రజా ప్రతినిధులు కుస్తీ పోటీల నిర్వహణకు ముందుకు వస్తున్నారు.
కఠోర శిక్షణ..
కుస్తీ పోటీలలో చిన్నారుల నుంచి కండలు తిరిగిన మల్లయోధుల వరకు పాల్గొంటున్నారు. మహిళలూ ఆసక్తి చూపుతున్నారు. ఈ పోటీలలో పాల్గొనేవారు కఠోర శిక్షణ తీసుకుంటారు. గురువుల వద్దకు వెళ్లి సుమారు ఆరు నెలలపాటు శిక్షణ పొందుతారు. మద్యం, మాంసానికి దూరంగా ఉంటారు. శిక్షణ పూర్తయ్యాక బరిలోకి దిగుతారు.
కొబ్బరి కాయ నుంచి వెండి కడియాల వరకు..
మల్ల యోధులకు ఇచ్చే బహుమతులు కొబ్బరి కాయనుంచి ప్రారంభమవుతాయి. పోటీల ప్రారంభానికి ముందుగా కల్లంలో కొబ్బరి కాయ కొట్టడంతో పాటు చిన్నారులకు ముందుగా కొబ్బరి కాయ కుస్తీ పోటీ నిర్వహించడం ఆనవాయతీగా వస్తోంది. విజేతలకు కొబ్బరికాయతోపాటు రూ. 10 నుంచి రూ. 3 వేల వరకు నగదు బహుమతులు అందిస్తారు. తుది పోరులో గెలిచినవారికి తులం నుంచి ఐదు తులాల వరకు బరువుండే వెండి కడియాన్ని బహూకరిస్తున్నారు.
యువతులు సైతం సై..
కుస్తీ పోటీల్లో యువకులే కాకుండా యువతులు సైతం సై అంటున్నారు. పురుషులతో ఢీకొడుతున్నారు. మహారాష్ట్రకు చెందిన 16 ఏళ్ల పల్లవి పవార్, ఢిల్లీకి చెందిన 18 ఏళ్ల బల్జిత్ కౌర్ కుస్తీ పోటీలలో సత్తా చాటుతున్నారు.
ఉత్సవాలలో ఆనవాయితీగా
కొనసాగుతున్న పోటీలు
ఇతర రాష్ట్రాలనుంచీ
మల్లయోధుల రాక
ఆసక్తిగా తిలకిస్తున్న ప్రజలు


