● హాట్ టాపిక్‌గా అసెంబ్లీ
నియోజకవర్గాల పెంపు అంశం
● స్వరూపం ఎట్లుంటుందోనన్న అంశంపై చర్చ
● పోటీకి అవకాశం దక్కుతుందన్న ఆశ
● లెక్కలేసుకుంటున్న నేతలు
దేశ వ్యాప్తంగా పార్లమెంట్ నియోజక వర్గాలతో పాటు అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ జరుగుతుందన్న సంకేతాలు వెలువడుతున్నాయి. ప్రస్తుతం జిల్లాలో నాలుగు అసెంబ్లీ నియోజక వర్గాలు ఉండగా.. అదనంగా మరో నియోజకవర్గం ఏర్పాటయ్యే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. ఇది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఉన్న నియోజకవర్గాల స్వరూపం మారుతుందా? కొత్తగా ఏ నియోజకవర్గం ఏర్పడుతుంది? అక్కడి రాజకీయ సమీకరణలు ఎలా ఉంటాయన్న దానిపై చర్చ జోరందుకుంది. ఇదే సమయంలో ఆయా పార్టీలకు చెందిన ద్వితీయ శ్రేణి నేతల్లో కొత్త ఉత్సాహం కనబడుతోంది. నియోజకవర్గాల స్వరూపం మారడం, కొత్త నియోజకవర్గాలు ఏర్పడడం మూలంగా తమకు అవకాశాలు వస్తాయని పలువురు ఆశిస్తున్నారు.
స్వరూపంపై చర్చ...
జిల్లాలో కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ, జుక్కల్ నియోజకవర్గాలు ఉండగా.. పునర్విభజన అనంతరం కొత్తగా మరో నియోజకవర్గం ఏర్పడే అవకాశాలున్నాయి. దీంతో ఏ నియోజకవర్గం పరిధిలో ఏ మండలం ఉంటుంది, కొత్తగా ఏర్పాటయ్యే నియోజకవర్గంలోకి ఏ మండలాలు వెళతాయి అన్న విషయమై జోరుగా ఊహాగానాలు సాగుతున్నాయి. కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాల్లోని కొన్ని మండలాలను కలిపి మూడు నియోజకవర్గాలు చేస్తారన్న ప్రచారం జోరందుకుంది. నియోజకవర్గాల పేర్లు కామారెడ్డి అర్బన్, కామారెడ్డి రూరల్, ఎల్లారెడ్డిగా ఉంటాయని కొందరు వాదిస్తుండగా.. కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గ కేంద్రాలను అలాగే ఉంచి, దోమకొండ కేంద్రంగా మరో నియోజకవర్గాన్ని ఏర్పాటు చేస్తారని మరికొందరు వాదిస్తున్నారు. ఇంకొందరు కామారెడ్డి, ఎల్లారెడ్డి, గాంధారి నియోజకవర్గాలు ఏర్పాటు చేస్తారంటున్నారు. జనాభాతో పాటు సరిహద్దులు, దూరభారం అంశాలను పరిగణనలోకి తీసుకుని నియోజకవర్గాల పునర్విభజన జరగొచ్చన్న అభిప్రాయాన్నీ వ్యక్తం చేస్తున్నారు. అయితే ఒక్కో నియోజకవర్గంలో ఎంత జనాభా ఉండాలి అన్నది తేలితే నియోజకవర్గాల సంఖ్య పెంపుపై స్పష్టత రావచ్చంటున్నారు.
అవకాశాలపైనా చర్చ..
నియోజకవర్గాల పునర్విభజన అంశం ద్వితీయ శ్రేణి నేతల్లో ఆశలు చిగురింపజేసింది. అధికార కాంగ్రెస్ పార్టీతో పాటు బీఆర్‌ఎస్, బీజేపీల్లో పలువురు నేతలు తమకు అవకాశాలు వస్తాయన్న ఆశతో ఉన్నారు. ఆయా ప్రాంతాలకు చెందిన పలువురు నేతలు లెక్కలేసుకుంటున్నారు. ప్రధాన పార్టీలల్లో దశాబ్దాలుగా పనిచేస్తున్న తమకే అవకాశం వస్తుందనే ధీమాతో కనబడుతున్నారు. కాగా మహిళా బిల్లు అమలులోకి రానున్న నేపథ్యంలో మహిళలకు రిజర్వు అయ్యే నియోజక వర్గాలపైనా చర్చ నడుస్తోంది. రిజర్వేషన్ అమలైతే తమకు అవకాశాలు దక్కుతాయని పలువురు మహిళా నేతలు ధీమాగా ఉన్నారు.
అసెంబ్లీ నియోజకవర్గాల పెంపు అంశం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. పునర్విభజన అనంతరం నియోజకవర్గాల స్వరూపం ఎలా ఉండొచ్చన్న విషయమై అంతటా చర్చలు నడుస్తున్నాయి. అసెంబ్లీ స్థానాలు పెరిగితే తమకు అవకాశం దక్కుతుందన్న ఆశతో పలువురు ద్వితీయ శ్రేణి నేతలు ఉన్నారు. – సాక్షి ప్రతినిధి, కామారెడ్డి


