ఎల్లారెడ్డి: ప్రభుత్వం పంట రుణాల పరిమితిని పెంచింది. సాగు వ్యయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకుంది. వచ్చే ఆర్థిక సంవత్సరంనుంచి ఇది అమలులోకి రానుంది. దీంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 128 రకాల పంటలతో పాటు కోళ్లు, గొర్రెలు, మేకలు, పందులు, తేనెటీగలు, చేపల పెంపకం తదితర యూనిట్లకు ఈ రుణపరిమితి వర్తించనుంది. తాకట్టు అవసరం లేని వ్యవసాయ రుణాల పరిమితిని కూడా రూ. 1.6 లక్షల నుంచి రూ. 2 లక్షల వరకు పెంచింది. కౌలు రైతులకు రూ. 2.5 లక్షల వరకు తాకట్టు లేని పంట రుణాలను పెంచాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
పంటలవారీగా పెంపు ఇలా..
ప్రభుత్వం దాదాపు అన్ని పంటలకు రుణ పరిమితిని రూ. 2 వేలు పెంచింది. వరికి గతంలో ఎకరాకు రూ. 46 వేలు పంట రుణం అందించేవారు. ప్రస్తుతం ఇది రూ. 48 వేలకు పెరిగింది. విత్తన వరికి ఎకరాకు రూ. 51 వేల వరకు రుణం ఇవ్వనున్నారు. చెరుకుకు రూ. 84 వేలు, పత్తికి రూ. 52 వేలు, మక్కకు రూ. 38 వేలు, పల్లికి రూ. 34 వేలు, శనగకు రూ. 28 వేలు, కందికి రూ. 27 వేల వరకు ఇస్తారు. ఇక కూరగాయలకు రూ. 35 వేలనుంచి రూ. 50 వేల వరకు పంట రుణాలు పొందవచ్చు. గొర్రెలు, మేకల, చేపల యూనిట్లకు సైతం రుణ పరిమితిని పెంచారు. చేపల పెంపకానికి రూ. 1.75 లక్షలు, పాడి గేదె ఒక్కింటికి రూ. 37,500, మేకలు, గొర్రెల పెంపకానికి రూ. 37 వేలు, లేయర్ కోడి (ఒక్కింటికి) రూ. 450, బ్రాయిలర్ కోడి (ఒక్కింటికి) రూ. 230 రుణ సాయం అందించనున్నారు.


