ఇక ‘ట్రావెల్ సేఫ్’!
మహిళల భద్రత కోసం..
కామారెడ్డి క్రైం: సమాజంలో మహిళలు, బాలికలకు భద్రత కరువవుతోంది. బస్సు, క్యాబ్, మరేదైనా అద్దె వాహనంలో మహిళలు, బాలికలు ఒంటరిగా ప్రయాణించాలంటే భయపడాల్సిన పరిస్థితులున్నాయి. వారు తమ గమ్యస్థానాలకు చేరుకునేదాకా కుటుంబ సభ్యులకు కంటి మీద కునుకుండదు. ఈ నేపథ్యంలో ఆడపిల్లల రక్షణ కోసం పోలీస్ శాఖ ప్రత్యేకంగా టీ–సేఫ్ యాప్ అందుబాటులోకి తీసుకొచ్చింది. రాష్ట్ర రాజధానిలో ఇప్పటికే అమలవుతున్న ఈ యాప్ సేవలపై జిల్లాలోనూ విస్తృతంగా అవగాహన కల్పించేందుకు జిల్లా పోలీస్ శాఖ చర్యలు తీసుకుంటోంది. షీటీం బృందంలోని మహిళా కానిస్టేబుళ్లు, సిబ్బందితో వీడియోను సైతం రూపొందించి అవగాహన కల్పిస్తున్నారు.
భద్రతా కవచంలా..
మహిళల ప్రయాణాన్ని మరింత సురక్షితం చేసే ఉద్దేశంతో 2024 మార్చి 12న టీ–సేఫ్ (ట్రావెల్ సేఫ్) అనే అప్లికేషన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఒక మహిళ ఒంటరిగా ప్రయాణిస్తున్నప్పుడు ఆమె తన గమ్యస్థానానికి క్షేమంగా చేరుకునే వరకు తోడుగా ఉండటమే ఈ యాప్ ముఖ్య ఉద్దేశం. దీనిని మహిళలందరూ ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.
యాప్ పనిచేస్తుందిలా..
ప్లేస్టోర్‌నుంచి టీ–సేఫ్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. పేరు, ఫోన్ నంబర్ రిజిస్టర్ చేసుకుని లాగిన్ అవ్వాలి.
● ప్రయాణం మొదలుపెట్టే ముందు ఎక్కడికి వెళ్లాలో ఎంచుకుని, తాము ఎక్కిన వాహనం(ఆటో, బస్సు, కారు, రైలు) వివరాలను యాప్‌లోని సిటిజన్ విభాగంలో నమోదు చేయాలి. ఆ వెంటనే ప్రయాణికురాలి మొబైల్‌కు ఒక మెసేజ్ అలర్ట్ వస్తుంది.
● ప్రయాణం మొదలైనప్పటి నుంచి పోలీసుల పర్యవేక్షణ ప్రారంభమవుతుంది. మీ లొకేషన్‌ను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ప్రతి 15 నిమిషాలకు ఒకసారి పోలీసు కంట్రోల్ రూమ్ నుంచి వాయిస్ కాల్ వస్తుంది. ప్రయాణికురాలు సురక్షితంగా ఉంటే ’1’ అని, ఏదైనా ప్రమాదం గానీ, అసౌకర్యం గానీ అనిపిస్తే ’2’ అని నొక్కాలి. ఆ తర్వాత భద్రత నిశ్చయం కోసం ముందుగా సెట్ చేసుకున్న 4 అంకెల పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేయాలి. ఒకవేళ ప్రతిస్పందన సరిగ్గా లేకపోయినా, అన్‌సేఫ్ అని బటన్ నొక్కినా వెంటనే కంట్రోల్ రూమ్ అప్రమత్తమై సహాయం అందిస్తుంది.
● ఒకవేళ గమ్యస్థానానికి చేరుకున్న తర్వాత ట్రిప్ పూర్తయిందని మొబైల్‌కు ఎస్సెమ్మెస్ రావడంతో ఆ ప్రయాణం విజయవంతంగా ముగుస్తుంది. ఈ విధంగా టీ–సేఫ్ యాప్ మహిళల ప్రతి ప్రయాణంలో ఒక అదృశ్య రక్షణ కవచంలా పర్యవేక్షిస్తుంది. నేటి కాలంలో ప్రతిఒక్కరూ సెల్‌ఫోన్ వాడుతున్నారు. కాబట్టి ప్రతి మహిళ యాప్ వాడకంపై అవగాహన పెంచుకోవాలనీ, సురక్షితంగా గమ్య స్థానాలకు చేరుకునేలా జాగ్రత్త పడాలని పోలీసులు సూచిస్తున్నారు.
ఒంటరిగా ప్రయాణించే మహిళలు, యువతులకు భద్రత కల్పించే ఉద్దేశంతో గతేడాది నుంచి పోలీసు శాఖ ‘ట్రావెల్ సేఫ్’ అప్లికేషన్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఆటోలు, క్యాబ్‌లు, ఇతర ప్రైవేటు వాహనాల్లో ప్రయాణించే వారు ఈ యాప్ సేవలను వినియోగించుకోవాలి. పోలీస్ కంట్రోల్ రూం పర్యవేక్షణలో ఉండే ఈ యాప్‌ను ఉపయోగిస్తే సురక్షితంగా గమ్య స్థానాలకు చేరేలా భద్రత ఉంటుంది.
– రాజేశ్ చంద్ర, ఎస్పీ, కామారెడ్డి
మహిళల భద్రతకు ప్రత్యేక యాప్
మహిళలు, యువతుల సురక్షిత
ప్రయాణానికి భరోసా
విస్తృతంగా ప్రచారం చేస్తున్న
జిల్లా పోలీసు శాఖ


