రథసప్తమికి సర్వం సిద్ధం
● ముస్తాబైన నీలకంఠేశ్వరాలయం
● వేల సంఖ్యలో హాజరుకానున్న భక్తులు
నిజామాబాద్ రూరల్: సూర్య భగవానుడి జన్మదినం పురస్కరించుకొని నిర్వహించే రథసప్తమి వేడుకలను ఆదివారం జరుపుకోనున్నారు. సూర్యుడు తన దిశను మార్చుకొని, రథాన్ని ఉత్తర దిశగా (ఉత్తరాయణం) మళ్లించి, లోకానికి వెలుగు, ఆరోగ్యాన్ని ప్రసాదించే రోజే రథసప్తమిగా పండితులు చెబుతారు. సూర్యుడిని ఆరాధించడంతో పాపాలు తొలగి, అనారోగ్య సమస్యలు నయమవుతాయని భక్తుల నమ్మకం. రథసప్తమి వేడుకలకు జిల్లా కేంద్రంలోని ప్రసిద్ధ నీలకంఠేశ్వర స్వామి ఆలయం ముస్తాబయ్యింది. దేవాలయ రాజగోపురం, గోపురాలతోపాటు దేవాలయ పరిసర ప్రాంతాల్లో విద్యుద్దీపాలంకరణ చేశారు. శోభాయాత్ర కోసం రథాన్ని సిద్ధం చేశారు. రథసప్తమి సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ ఈవో శ్రీరామ్ రవీందర్, ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ సిరిగిరి తిరుపతి తెలిపారు.


