బీజేపీ గెలుపుతోనే మున్సిపాలిటీల సమగ్ర అభివృద్ధి
కామారెడ్డి టౌన్: కామారెడ్డి బల్దియాతో పాటు జిల్లాలోని మిగతా మూడు మున్సిపాలిటీల సమగ్ర అభివృద్ధి కేవలం బీజేపీతోనే సాధ్యమని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణ రెడ్డి అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన జిల్లా మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా కార్యకర్తలు పనిచేయాలని పిలుపునిచ్చారు. పార్టీ శ్రేణులు ఉత్సాహంగా క్షేత్రస్థాయిలోకి వెళ్లి, వార్డుల వారీగా ప్రజల సమస్యలను తెలుసుకుంటూ పార్టీ విజయానికి కృషి చేయాలని సూచించారు. ప్రతి వార్డులో బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థి గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు నడుం బిగించాలని ఆయన కోరారు. అవినీతి రహిత పాలన రావాలంటే మున్సిపల్ చైర్మన్‌లు బీజేపీ కై వసం చేసుకోవాలన్నారు. ఈ సమావేశంలో మాజీ ఎంపీ బీబీ పాటీల్, రాష్ట్ర నాయకులు మురళీధర్‌గౌడ్, బాణాల లక్ష్మారెడ్డి, యెండల లక్ష్మినారాయణ, జిల్లా అధ్యక్షుడు నీలం చిన్నరాజులు, నాయకులు అరుణతార, రంజిత్‌మోహన్ తదితరులు పాల్గొన్నారు.


