ఇస్రో విజ్ఞాన యాత్ర విజయవంతం చేయాలి
● శ్రీహరికోటకు 50 మంది
విద్యార్థినులు, 30 మంది ఉపాధ్యాయులు
● విద్యాశాఖ అధికారులతో కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
కామారెడ్డి టౌన్: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఎంపిక చేసిన 50 మంది విద్యార్థినుల ఇస్రో విజ్ఞాన యాత్రను విజయవంతం చేయాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ డీఈవో ఎస్ రాజు, జిల్లా సైన్స్ అధికారి సిద్ధిరాంరెడ్డికి ఆదేశించారు. యాత్ర కార్యక్రమంపై కలెక్టర్ తన చాంబర్‌లో శనివారం చర్చించారు. నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోట (సతీష్ ధావన్ స్పేస్ రీసెర్చ్ సెంటర్) సందర్శనకు విద్యార్థినులతోపాటు మార్గదర్శకత్వం వహించేందుకు 30 మంది ఉపాధ్యాయులు కూడా ఈనెల 28న కామారెడ్డి నుంచి వెళ్తున్నట్లు తెలిపారు. ఈ బృందం 29వ తేదీన ఇస్రో సంస్థలోని లాంచింగ్ ప్యాడ్, స్పేస్ మ్యూజియం, ఇతర కీలక విభాగాలను సందర్శించనున్నారని తెలిపారు. పర్యటనకు సంబంధించి విద్యార్థినులకు రవాణా, భోజన వసతులను చూసుకోవాలని కలెక్టర్ డీఈవోను ఆదేశించారు. పర్యటన ముగించుకుని ఈ నెల 30వ తేదీన విద్యార్థినుల బృందం తిరిగి కామారెడ్డికి చేరుకుంటుందన్నారు. జిల్లా సైన్స్ అధికారి సిద్ధిరాంరెడ్డి ఈ పర్యటనకు సమన్వయకర్తగా బాధ్యత వహించనున్నారు. విద్యార్థులకు ఈ అవకాశాన్ని కల్పించిన సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ డైరెక్టర్‌కు డీఈవో కృతజ్ఞతలు తెలిపారు.


