నిఘా నీడలో ఎన్నికలు
కామారెడ్డి క్రైం : గ్రామ పంచాయతీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించడానికి జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేపట్టింది. ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే విధంగా అక్రమంగా మద్యం, నగదు, ఇతర వస్తువుల తరలింపుపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసింది. ఇందుకోసం జిల్లాలో ఏర్పాటు చేసిన ప్రత్యేక తనిఖీ బృందాలు, చెక్‌పోస్టులు నిరంతరంగా పని చేస్తున్నాయి. రూ.50 వేలకు మించి నగదు తరలింపుపై ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఎన్నికల కోడ్ పూర్తయ్యే వరకు ప్రతి ఒక్కరూ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని తప్పనిసరిగా పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.
ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించడంలో ఎఫ్‌ఎస్‌టీ, ఎస్‌ఎస్‌టీ బృందాల పాత్ర ఎంతో కీలకం. ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుంచి అక్రమంగా మద్యం, నగదు, వస్తువుల రవాణా కాకుండా అడ్డుకునేందుకు ప్రత్యేకంగా 5 ఎస్‌ఎస్‌టీ (సర్వేలెన్స్ అండ్ స్టాటిస్టికల్ టీమ్)లను ఏర్పాటు చేశారు. జిల్లాలోని రాష్ట్ర సరిహద్దుల వద్దనున్న చెక్‌పోస్టులలో రెండు బృందాలను, జిల్లాకు ఆనుకుని ఉన్న ఇతర జిల్లాల నుంచి జరిగే రాకపోకలపై నిఘా వేసేందుకు మరో మూడు బృందాలను నియోగించారు. ఈ బృందాలు ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా ఏదైనా రవాణా జరిగినట్లు గుర్తిస్తే సీజ్ చేయడం, కేసులు నమోదు చేయడం చేస్తున్నారు. ఇవి కాకుండా గ్రామాల్లో ప్రత్యేక తనిఖీల కోసం పోలీసు, రెవెన్యూ, ఎకై ్సజ్ అధికారులతో కలిసి మండలానికో ఎఫ్‌ఎస్‌టీ (ఫ్లయింగ్ స్క్వాడ్ టీం) ఏర్పాటు చేశారు. ఆయా బృందాలు గ్రామాల్లో పర్యటిస్తూ వాహనాల తనిఖీలతో పాటు ఏవైనా ఫిర్యాదులు వస్తే వెంటనే అక్కడికి చేరకుని విచారణ జరుపుతాయి. వీడియోగ్రఫీతో కూడిన విచారణ, తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇవే కాకుండా వ్యయ పరిశీలన బృందాలు పోటీలో ఉన్న అభ్యర్థుల ఖర్చులను లెక్కించడంలో, ఎంసీసీ (మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్) బృందాలు ఎన్నికల తీరును పరిశీలించడంలో నిమగ్నమయ్యాయి.
మాచారెడ్డి వద్ద ఏర్పాటు చేసిన చెక్‌పోస్టును పరిశీలిస్తున్న ఎస్పీ (ఫైల్)
విస్త ృతంగా తనిఖీలు..
జిల్లాలో ఏర్పాటు చేసిన ఎఫ్‌ఎస్‌టీ, ఎస్‌ఎస్‌టీ బృందాలు నోటిఫికేషన్ వచ్చిన నాటి నుంచి విస్తృతంగా తనిఖీ చేస్తున్నాయి. ఎన్నికల ప్రవర్తనా నియమావళి నిబంధనల్లో భాగంగా రూ.50 వేలకు మించి ఎవరూ రవాణా చేయకూడదనే నిబంధన అమలులో ఉన్న విషయం తెలిసిందే. ఐదు రోజుల క్రితం మాచారెడ్డి మండలంలో జరిగిన తనిఖీల్లో డీసీఎంలో ప్రయాణిస్తున్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్‌కు చెందిన ఓ వ్యక్తి వద్ద రూ.10 లక్షలను ఎఫ్‌ఎస్‌టీ బృందాలు గుర్తించి పట్టుకున్నాయి. ఆధారాలు పరిశీలించి తరువాత విడిచిపెట్టారు. మూడు రోజుల క్రితం తాడ్వాయి మండలం కన్కల్ గ్రామంలో ఓ సర్పంచ్ అభ్యర్థి పంపిణీకి సిద్ధంగా ఉంచిన 41 బిందెలను ఎఫ్‌ఎస్‌టీ బృందం పట్టుకుంది. రెండు రోజుల క్రితం రామారెడ్డిలో ఓ సర్పంచ్ అభ్యర్థి ఇంట్లో 96 మద్యం సీసాలు, అన్నారం బెల్టు షాప్‌లో 15 బాటిళ్ల మద్యం పట్టుకుని సీజ్ చేశారు. జిల్లాకు ఎన్నికల సాధారణ పరిశీలకుడిగా నియమితులైన సత్యనారాయణరెడ్డితో పాటు కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ జిల్లాలో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పక్బందీగా అమలు చేసేలా నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్న
అధికారులు
నిరంతరం కొనసాగుతున్న తనిఖీలు
మద్యం, నగదు, వస్తువుల
తరలింపుపై ప్రత్యేక నిఘా


