పోస్టల్ బ్యాలెట్‌కు ఏర్పాట్లు చేయండి
కామారెడ్డి క్రైం: పోస్టల్ బ్యాలెట్ నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులకు సూచించారు. మొదటి విడత ఎన్నికలు జరుగుతున్న మండలాల రిటర్నింగ్ అధికారులు, సహాయ జిల్లా ఎన్నికల అధికారులైన ఎంపీడీవోలు, తహసీల్దార్‌లతో శనివారం కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పోస్టల్ బ్యాలెట్ పత్రాలను ఏ విధంగా జారీ చేయాలి, వాటిని ఏవిధంగా ఓటరు ఫెసిలిటేషన్ కేంద్రాల్లో అందజేయాలి తదితర అంశాలపై సూచనలు ఇచ్చారు. మొదటి విడత ఎన్నికలు జరుగుతున్న మండలాల్లో ఫెసిలిటేషన్ కేంద్రాలను ఈనెల 6 నుంచి 9వ తేదీ వరకు ఆయా ఎంపీడీవో కార్యాలయాల్లో నిర్వహించాలన్నారు. అన్ని పంచాయతీలు, వార్డుల ఓటరు జాబితాలు అందుబాటులో ఉంచాలన్నారు. ఫారం 17 లో ఓటరు డిక్లరేషన్ చేసిన తరువాత గెజిటెడ్ అధికారి సంతకం చేయాల్సి ఉంటుందన్నారు. ఓటరు సౌకర్యార్థం ప్రతి కేంద్రంలో ఒక గెజిటెడ్ అధికారిని నియమించాలన్నారు. ఫెసిలిటేషన్ కేంద్రాలను ప్రారంభించే తేదీలను పోటీలో ఉన్న అభ్యర్థులకు తెలియజేయాలన్నారు. పోలీసు భద్రత, వీడియోగ్రఫీ పక్కాగా చేపట్టాలన్నారు.


