అభివృద్ధికి అంతా సహకరించాలి
కామారెడ్డి టౌన్ : జిల్లా కేంద్రం అభివృద్ధికి ప్రతి ఒక్కరు సహకరించాలని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి కోరారు. శనివారం ఆయన కామారెడ్డి రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనులను పరిశీలించారు. రైల్వే అధికారులతో మాట్లాడి నిర్మాణ పనులపై చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. పట్టణంలో ప్రధానంగా నెలకొన్న ట్రాఫిక్ సమస్య, బల్దియా ఆదాయ మార్గాలపై దృషి పెట్టినట్లు తెలిపారు. ఇందులో భాగంగా రెల్వే స్టేషన్ గోడను ఆనుకుని ఉన్న కోకలు, మడిగెలను తొలగిస్తే ఇందిరాగాంధీ చౌరస్తా వద్ద ట్రాఫిక్ సమస్య తగ్గుతుందన్నారు. స్టేషన్ రోడ్డు మధ్యలో రైల్వే స్టేషన్‌లోకి ఎంట్రెన్స్ ఉంటుందన్నారు. తొలగించిన దుకాఽణదారులకు మున్సిపల్ స్థలాలైన పొట్టిశ్రీరాములు విగ్రహం పక్కన 41, గంజ్ స్కూల్ ముందు 75 మడిగెలను మూడు నెలల్లోపు నిర్మించి ఇస్తామన్నారు. సర్వే నంబర్ 6లో ఇతరుల కబ్జాలో ఉన్న రూ. 100 కోట్ల విలువైన స్థలాన్ని ఇటీవల ఖాళీ చేయించామన్నారు. ఆదివారం సుభాష్, జేపీఎన్, నాజ్‌టాకీస్ రోడ్లపై నిర్వహిస్తున్న కూరగాయల మార్కెట్‌ను సర్వే నంబర్ 6లోకి మారుస్తామని తెలిపారు. దీంతో ట్రాఫిక్ ఇబ్బందులు తొలగుతాయన్నారు. రోడ్లపై కూర్చుని ఇబ్బందులు పడేకంటే బాజాప్త బల్దియా స్థలంలో కూరగాయలు అమ్ముకోవడం మంచిదని పేర్కొన్నారు. రైల్వే స్టేషన్ లోపల కూడా అధికారులు మడిగెలు ఏర్పాటు చేస్తారన్నారు. అవసరం ఉన్నవారు అద్దె చెల్లించి అందులో దుకాణా లు నిర్వహించుకోవచ్చన్నారు. పట్టణాన్ని మరింత అభివృద్ధి చేసుకునేందుకు వ్యాపారులు, ప్రజలు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో రైల్వే అధికారులు, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.
స్టేషన్‌రోడ్‌లో కోకా దుకాణాలను
ఖాళీ చేయాలి
బల్దియా స్థలంలో దుకాణాలు
నిర్మించి ఇస్తాం
ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి


