ఇచ్చేస్తేపోలా.. హామీ!
ఎవరి ఆస్తులూ కబ్జా చేయడట!
పంచాయతీ ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా అభ్యర్థులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. గెలిపిస్తే చేసే పనులను వివరిస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. ఈ క్రమంలో హామీల వర్షం కురిపిస్తున్నారు. పలువురు అభ్యర్థులు ఇస్తున్న హామీలు స్థాయికి మించి ఉంటుండడంతో ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : పల్లెపోరు సార్వత్రిక ఎన్నికలను తలపిస్తోంది. పలువురు అభ్యర్థులు ఇస్తున్న హామీలు ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. చిన్నచిన్న గ్రామాల్లో సైతం కొందరు అభ్యర్థులు పెద్దపెద్ద హామీలు ఇస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి గ్రామ పంచాయతీలకు వచ్చే నిధులు, గ్రామంలో ఇంటి పన్నులు, ఇతర ఆదాయ వనరులు ఏమేరకు ఉంటాయో కనీస అవగాహన లేకుండానే కొందరు అభ్యర్థులు పెద్దపెద్ద హామీలతో పత్రాలు ముద్రించి పంచుతున్నారు. మరికొందరు అభ్యర్థులు సొంత డబ్బులతో ప్రజలకు చేసే సేవల గురించి చెబుతున్నారు. అయితే అభ్యర్థులు చేస్తున్న వాగ్దానాలు, ఇస్తున్న హామీలను చూసి ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. సాధ్యం కాని, స్థాయికి మించిన హామీలు ఇవ్వడమేంటని కొందరు ప్రశ్నిస్తున్నారు.
గెలుపు కోసం అభ్యర్థులు రకరకాల హామీలు ఇస్తున్నారు. ఓ అభ్యర్థి గ్రామంలో ప్రతి ఒక్కరికీ రూ. 2 లక్షల ప్రమాద బీమా చేయిస్తానని హామీ ఇచ్చాడు. మరో గ్రామంలో ఆడపిల్ల పుడితే రూ.3,116 ఆమె పేరిట డిపాజిట్ చేస్తానని, ఎవరైనా చనిపోతే రూ.5 వేలు ఇస్తానని వాగ్దానం చేశాడు. ఇంకో గ్రామంలో యువత పోటీ పరీక్షలకు సన్నద్ధం అయ్యేందుకు గ్రంథాలయం ఏర్పాటు చేసి, అవసరమైన పుస్తకాలను అందుబాటులో ఉంచుతానని చెబుతున్నాడు. కొన్ని చోట్ల గుడులను అభివృద్ధి చేస్తామని, ప్రభుత్వ పాఠశాలల్లో కంప్యూటర్ ల్యాబ్ ఏర్పాటు చేస్తామని హామీ ఇ స్తున్నారు. కొందరు అభ్యర్థులు గ్రా మంలో నీటి శుద్ధి ప్లాంటు ఏర్పాటు చేస్తామంటుండగా.. ఓ అభ్యర్థి కూలింగ్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తానని భరోసా ఇస్తున్నాడు. ఓ గ్రామంలో ప్రధా న రహదారిపై సెంట్రల్ లైటింగ్, డ్రెయినేజీలు ఏ ర్పాటు చేస్తానని హామీ ఇస్తూనే.. దానిని నెరవేర్చకపోతే రాజీనామా చేస్తానంటూ రాసిన బాండ్‌ను చూిపిస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నాడు. జిల్లాలోని ఓ గ్రా మంలో అభ్యర్థి తనను గెలిపిస్తే విద్యుత్ దీపాలు, డ్రెయినేజీలు, సిమెంటు రోడ్లు అన్నీ వేయిస్తానని మాట ఇస్తున్నాడు. ఇంకో అభ్యర్థి తనను గెలిపిస్తే గ్రామస్తులందరికీ ఉపయోగపడేలా ఫంక్షన్ హాల్ ని ర్మించి ఇస్తానని చెబితే, ఇంకో అభ్యర్థి మహిళా సంఘాల సమావేశాలకు భవనం నిర్మించుకునేందుకు ఎకరం భూమి సమకూరుస్తానని హామీ ఇచ్చారు. కుల సంఘాల ఓట్లకు గాలం వేసేందుకు కొందరు అభ్యర్థులు సంఘాల పెద్ద మనుషులతో సమావే శమై వారు కోరినదల్లా చేయిస్తామంటున్నారు. అ యితే కొన్ని గ్రామాల్లో కుల సంఘాల వాళ్లు ముందుగానే డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేసి మరీ తీ సుకుంటున్నట్లు తెలిసింది. కొన్నిచోట్ల అభ్యర్థులు ఎవరొచ్చినా సరే మీకే మా మద్దతని చెప్పి ఎంత ఇస్తే అంత తీసుకుంటున్నారని సమాచారం.
ఓ అభ్యర్థి వైరెటీగా కరపత్రాన్ని రూపొందించాడు. తనను గెలిపిస్తే ఎవరి ఆస్తులు, భూములు, ప్లాట్లు, ఇళ్లు కబ్జా చేయబోనని మాట ఇస్తున్నాడు. ఎవరి దగ్గరా నయాపైసా తీసుకోనని చెబుతున్నాడు. ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి పైసాకు లెక్క చూపుతానని హామీ ఇస్తున్నాడు. మరో అభ్యర్థి సర్పంచ్‌గా గెలిస్తే తనకు వచ్చే గౌరవ వేతనం కూడా ప్రజలకోసమే వినియోగిస్తానని చెబుతున్నారు. రాజకీయాలపై అవగాహన ఉన్న వారు ఓటర్లను మచ్చిక చేసుకునేందుకు వారి ఇళ్లకు వెళ్లి మద్దతు కోరుతున్నారు. అలాగే ప్రభుత్వ నిధులతో అభివృద్ధి పనులు చేపడతామని మరికొందరు భరోసా ఇస్తున్నారు. పంచాయతీ ఎన్నికల ప్రచారం, అభ్యర్థులు ఇస్తున్న హామీలు, కురిపిస్తున్న వరాలను చూస్తుంటే సార్వత్రిక ఎన్నికలను తలపిస్తున్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.
పల్లె పోరులో గెలుపుకోసం
అభ్యర్థుల విశ్వ ప్రయత్నాలు
ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నంలో స్థాయికి మించి వాగ్దానాలు
హామీ పత్రాలు పంచుతున్న పలువురు..
విస్మయం వ్యక్తం చేస్తున్న ప్రజలు
ఇచ్చేస్తేపోలా.. హామీ!


