‘ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలి’
కామారెడ్డి క్రైం: ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులకు సూచించారు. ఎన్నికల నిర్వహణపై శుక్రవారం కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో మాట్లాడారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలకు సంబంధించి ఇప్పటివరకు జిల్లాలోని ఆయా ప్రాంతాల నుంచి 7 ఫిర్యాదులు వచ్చాయన్నారు. ఎంసీసీ(మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్) పర్యవేక్షణకు ఏర్పాటు చేసిన బృందాలు ఫిర్యాదులపై వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సర్వీస్ ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకునేలా ప్రతి మండల పరిషత్ కార్యాలయంలో కేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు. ఎన్నికల విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు దశలవారీగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు విక్టర్, మధుమోహన్, జెడ్పీ సీఈవో చందర్, ఆర్డీవో వీణ, డీపీవో మురళి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.


