చెరుకు సాగుకు ప్రోత్సాహం
సదాశివనగర్ : చెరుకు సాగును ప్రోత్సహించేందుకోసం జిల్లాలోని చెరుకు కర్మాగారాలు చర్యలు తీసుకుంటున్నాయి. విత్తనాన్ని ఉచితంగా అందించడంతోపాటు రాయితీపై అగ్రి డ్రోన్‌ను అందించనున్నట్లు ప్రకటించింది.
జిల్లాలో చెరుకు సాగు క్రమంగా తగ్గుతూ వస్తోంది. గతంలో బెల్లం వండిన సమయంలో సుమారు 30 వేల ఎకరాలలో ఈ పంట సాగయ్యేది. ఏడాది పంట కావడంతోపాటు నల్లబెల్లం తయారీపై ప్రభుత్వం ఆంక్షలు విధించడంతో రైతులు క్రమంగా చెరుకు సాగుకు దూరమయ్యారు. ప్రస్తుతం ఫ్యాక్టరీ పరిధిలో 10 వేల ఎకరాల వరకు పంట సాగవుతోంది. గాయత్రి షుగర్స్‌కు అడ్లూర్ ఎల్లారెడ్డిలో ఒకటి, నిజాంసాగర్ మండంలోని మాగిలో మరొక చెరుకు ఫ్యాక్టరీ ఉన్నాయి. ఫ్యాక్టరీ మనుగడ కోసం యాజమాన్యం జిల్లాలో చెరుకు సాగును ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా రైతులకు ఉచితంగా విత్తనం ఇస్తామంటూ ప్రచారం చేస్తోంది. ఎకరానికి రూ. 9,437 విలువ గల 2.50 టన్నుల చెరుకు విత్తనాన్ని ఉచితంగా అందించనున్నట్లు చెబుతోంది. విత్తనానికి తోడు ఈ సీజన్‌లో రూ. 7.50 లక్షల విలువ చేసే గాయత్రి ఏఈఆర్‌వో ఏజీ–10 రకం అగ్రి డ్రోన్‌ను అందుబాటులోకి తెచ్చింది. దీనిని లక్ష రూపాయల రాయితీపై చెరుకు రైతులకు ఇవ్వనున్నట్లు తెలిపింది. డ్రోన్‌తో తక్కువ సమయంలో ఎక్కువ విస్తీర్ణంలో ఎరువులు, పురుగుల మందులను పిచికారి చేయవచ్చు. వాతావరణ అనుకూలతను బట్టి రోజుకు 20 నుంచి 30 ఎకరాలలో మందులు పిచికారి చేయవచ్చని ఫ్యాక్టరీ ప్రతినిధులు పేర్కొంటున్నారు. తద్వారా కూలీల కొరతను అధిగమించ వచ్చంటున్నారు.
చెరుకు రైతులను ప్రోత్సహించేందుకు కృషి చేస్తున్నాం. రైతులకు ఉచితంగా విత్తనాన్ని పంపిణీ చేస్తున్నాం. ఎరువులు, పురుగుమందులు, గడ్డి మందు స్ప్రే చేసేందుకోసం లక్ష రూపాయల రాయితీపై అగ్రి డ్రోన్‌ను అందిస్తున్నాం. రైతులు వీటిని సద్వినియోగం చేసుకోవాలి. ఈ డ్రోన్ల ద్వారా రైతులు అదనపు ఆదాయం కూడా పొందవచ్చు.
– వేణుగోపాల్ రావు, గాయత్రి షుగర్స్ ఫ్యాక్టరీ వైస్ ప్రెసిడెంట్, అడ్లూర్ ఎల్లారెడ్డి
ఎరువులు పిచికారి చేస్తున్న డ్రోన్
రాయితీపై అగ్రి డ్రోన్ పంపిణీకి
ముందుకొచ్చిన యాజమాన్యం
విత్తనం ఉచితంగా ఇస్తామంటూ ప్రచారం
రైతుకు ఎకరాకు రూ. 10 వేల మేర చేకూరనున్న ప్రయోజనం
చెరుకు సాగుకు ప్రోత్సాహం
చెరుకు సాగుకు ప్రోత్సాహం


