ఉజ్వల కనెక్షన్‌కు దరఖాస్తు చేసుకోండి
కామారెడ్డి టౌన్: జిల్లాలో అర్హులైనవారు ఉజ్వల గ్యాస్ కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. బుధవారం కలెక్టర్ అధ్యక్షతన ఆయన చాంబర్‌లో జిల్లా ఉజ్వల కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాకి కొత్తగా 284 (ఇండేన్ –169, భారత్ –33, హెచ్‌పీ–82) ఉజ్వల కనెక్షన్లు మంజూరయ్యాయని తెలిపారు. అర్హత గలవారు జిల్లాలో ఉన్న ఎల్‌పీజీ డిస్ట్రిబ్యూటర్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తులకు తుది గడువు లేదన్నారు. రేషన్ కార్డ్ ఉండి, గ్యాస్ కనెక్షన్ లేని బీపీఎల్ కుటుంబాలకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుందని తెలిపారు. ఈ కనెక్షన్ పొందిన వారికి గ్యాస్ సిలిండర్, మొదటి రీఫిల్, గ్యాస్ స్టౌ, సురక్ష పైపు, రెగ్యులేటర్, ఇన్‌స్టాలేషన్ పూర్తిగా ఉచితంగా అందుతాయన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ విక్టర్, డీసీఎస్‌వో వెంకటేశ్వర్‌రావు, జిల్లా బీపీసీఎల్ నోడల్ ఆఫీసర్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.


