ఆయిల్‌పాం సాగుపై అవగాహన కల్పించాలి
● ప్రతి సొసైటీ పరిధిలో
వంద ఎకరాల సాగు లక్ష్యం
● కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
కామారెడ్డి టౌన్: ఆయిల్‌పాం సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. బుధవారం కలెక్టరేట్ కార్యాలయంలో ఉద్యాన, పట్టుపరిశ్రమల శాఖ, హెచ్‌యూఎల్ సంస్థల ఆధ్వర్యంలో వ్యవసాయ, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల కార్యదర్శులకు ఆయిల్‌పాం సాగుపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి వ్యవసాయ ప్రాథమిక సంఘానికి 100 ఎకరాలలో ఆయిల్‌పాం సాగు లక్ష్యాన్ని నిర్దేశించామన్నారు. నిర్దేశించిన లక్ష్యాలను సాధించాలన్నారు. ఆయిల్‌పాం సాగు రైతులకు దీర్ఘకాలిక ఆదాయ వనరుగా మారుతుందన్నారు. అలాగే ఈ రంగంలో ప్రభుత్వం, సహకార సంఘాలు పరస్పర సమన్వయంతో పని చేయాలని సూచించారు. ఆయిల్‌పాం ఆర్థిక ప్రాధాన్యత, సాగు పద్ధతులు, నీటి వినియోగం, వాతావరణ అనుకూలత, ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలు, మార్కెట్ అవకాశాలపై సంబంధిత అధికారులు వివరించారు. కార్యక్రమంలో జిల్లా ఉద్యాన శాఖ అధికారి జ్యోతి, జిల్లా వ్యవసాయ అధికారి మోహన్‌రెడ్డి, జిల్లా కోఆపరేటివ్ అధికారి రామ్మోహన్, పీఏసీఎస్ కార్యదర్శులు, అధికారులు పాల్గొన్నారు.


