పేదలు నివసించే కాలనీలపై చిన్నచూపు
● వారం రోజులుగా వెలగని వీధిదీపాలు
బాన్సువాడ రూరల్: పేరుగొప్ప– ఊరుదిబ్బ అన్నట్లు మారింది బాన్సువాడ మున్సిపాలిటీ అధికారుల పనితీరు. రూ.కోట్లలో అభివృద్ధి నిధులు, ఉమ్మడి జిల్లాలో ఎక్కడా లేని విధంగా ట్యాక్సులు వసూలు చేస్తున్న మున్సిపాలిటీ అధికారులు పేదలు నివసించే కాలనీల పట్ల సవతి తల్లి ప్రేమ చూిపిస్తున్నారు. శివారు కాలనీలు, వందశాతం పేదలు నివసించే పీఎస్‌ఆర్ డబుల్‌బెడ్‌రూం కాలనీల్లో సమస్యల పట్ల శ్రద్ధ చూపడం లేదు. వారం రోజులుగా బాన్సువాడ డబుల్‌బెడ్‌రూం కాలనీకి వెళ్లే రహదారిపై వీధి దీపాలు వెలగడం లేదు. ఉదయం పొట్టకూటి కోసం వివిధ పనులకు వెళ్లి రాత్రి ఇంటికి తిరిగి వచ్చే బాటసారులు విద్యుత్ సౌకర్యం లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షాలు పడుతుండటంతో పాటు రహదారికి ఇరువైపులా పంట పొలాలు, నిజాంసాగర్ ఉపకాలువ ఉండటంతో పాములు, తేళ్లు, ఇతర విషకీటకాలు రోడ్డుపైకి వస్తున్నాయని కాలనీవాసులు వాపోతున్నారు. పట్టణంలో పెద్దలు నివసించే కాలనీపై అధికారులు తీసుకుంటున్న శ్రద్ధలో సగమైనా పేదలు నివసించే కాలనీపై తీసుకోవాలని, వెంటనే విద్యుత్ వ్యవస్థను పునరుద్ధరించాలని పీఎస్‌ఆర్ డబుల్‌బెడ్‌రూం కాలనీవాసులు కోరుతున్నారు.


