క్రైం కార్నర్
పాముకాటుతో చిన్నారి మృతి
బాన్సువాడ రూరల్: పాముకాటుతో ఓ చిన్నారి మృతి చెందిన ఘటన బాన్సువాడ మండలం కాలునాయక్ తండాలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తండాకు చెందిన చౌహాన్ శ్రీకాంత్ కుమార్తె సరస్వతి(3) మంగళవారం రాత్రి కుటుంబ సభ్యులతో కలిసి నిద్రపోయింది. బుధవారం ఉదయం 6 గంటలకు చిన్నారి నోటి నుండి నురుగులు రావడాన్ని గుర్తించిన కుటుంబీకులు పాముకాటు వేసినట్లు గుర్తించారు. వెంటనే వారు బాన్సువాడకు తరలించగా మెరుగైన చికిత్స కోసం నిజామాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. మృతురాలి తండ్రి శ్రీకాంత్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయగా, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బాన్సువాడ ఏరియా ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. చిన్నారి మృతితో తండాలో విషాదచాయలు అలుముకున్నాయి.
చేపల వేటకు వెళ్లి ఒకరు..
నస్రుల్లాబాద్: చేపల వేటకు వెళ్లి ఒకరు ప్రమాదవశాత్తు నీట మునిగి మృతి చెందిన ఘటన నస్రుల్లాబాద్ మండలం నెమ్లి గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్సై రాఘవేంద్ర తెలిపిన వివరాల ప్రకారం.. నెమ్లి గ్రామానికి చెందిన కర్రె హన్మాండ్లు(30) ఈ నెల 27న రాత్రి స్థానిక చెరువులో చేపల వేట కోసం ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబీకులు పలుచోట్ల వెతికినా ఆచూకీ లభించలేదు. బుధవారం ఉదయం చెరువులో మృతదేహం కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. హన్మాండ్లు కాళ్లకు వల చుట్టుకోవడంతో నీటి మునిగి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతుడి భార్య కవిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
విద్యుత్ షాక్‌తో మరొకరు..
రుద్రూర్: కోటగిరి మండలం ఎత్తొండ గ్రామంలో విద్యుత్ షాక్‌తో ఒకరు మృతి చెందినట్లు కోటగిరి ఏఎస్సై బన్సీలాల్ బుధవారం తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. ఎత్తొండ గ్రామానికి చెందిన తాళ్ల శ్రీనివాస్(47) మంగళవారం రాత్రి మూత్ర విసర్జన కోసం బాత్‌రూమ్‌కు వెళ్తుండగా తన ఇంటికి ఉన్న ఇనుప మెట్లను తాకిన సమయంలో విద్యుత్‌షాక్‌కు గురయ్యాడు. గమనించిన కుటుంబీకులు చికిత్స నిమిత్తం బోధన్ ప్రభుత్వాసుపత్రికి తరలించగా శ్రీనివాస్ మృతి చెందినట్లు నిర్ధారించారు. బాత్‌రూమ్‌కు సంబంధించిన విద్యుత్ తీగలు తెగి ఇనుప మెట్లపై పడడంతో విద్యుత్ షాక్‌కు గురైనట్లు గుర్తించారు. మృతుడి భార్య లలిత ఫిర్యా దు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై తెలిపారు.
విద్యుత్ షాక్‌తో గేదె..
బాన్సువాడ: బీర్కూర్ శివారులో బుధవారం విద్యుత్ షాక్‌తో గేదె మృతి చెందింది. బీర్కూర్ కామేశ్వర్‌రావుకు చెందిన గేదెలను మేత కోసం శివారు ప్రాంతంలోకి తీసుకెళ్లాడు. కురుస్తున్న వర్షాలతో పంట పొలాల్లో ఉన్న విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ దగ్గర మేత కోసం వెళ్లిన గేదెకు విద్యుత్ షాక్ తగలడంతో గేదె అక్కడికక్కడే చనిపోయింది. ట్రాన్స్‌ఫార్మర్ చుట్టూ కంచె ఏర్పాటు చేయకపోవడంతోనే గేదెకు విద్యుత్ షాక్ తగిలి చనిపోయిందని, అధికారులు స్పందించి అందించాలని రైతు కామేశ్వర్‌రావు కోరారు.
నవీపేట: కుటుంబ కలహాలతో ఓ యువకుడు చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన నవీపేట మండలం లింగాపూర్‌లో చోటు చేసుకుంది. ఎస్సై తిరుపతి బుధవారం తెలిపిన వివరాల ప్రకారం.. లింగాపూర్ గ్రామానికి చెందిన గంధం సాయిలు(36)కు ఆర్మూర్ మండలం పిప్రి గ్రామానికి చెందిన కవితతో కొన్నేళ్ల క్రితం వివాహమైంది. కొంతకాలంగా భార్యాభర్తల మధ్య మనస్పర్థలు రావడంతో కవిత పుట్టింటికి వెళ్లింది. దీంతో జీవితంపై విరక్తితో సాయిలు ఈనెల 27న ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. బుధవారం సాయిలు మృతదేహం గ్రామ శివారులోని చెరువులో లభ్యమైంది. మృతుడి తల్లి గంధం గంగు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
క్రైం కార్నర్
క్రైం కార్నర్


