వెలగని వీధి దీపాలు
కామారెడ్డి రూరల్: కామారెడ్డి మున్సిపల్ పరిధి 9వ వార్డు పరిధిలోని కల్కినగర్ అంధకారంలో మగ్గుతోంది. లింగాపూర్ గ్రామ పరిధిలోని కల్కినగర్ మున్సిపల్‌లో కలిశాక అభివృద్ధికి దూరమవుతుందనే మాటలు గ్రామస్తుల నుంచి వినిపిస్తున్నాయి. కామారెడ్డి మున్సిపల్‌లో విలీనమైన తర్వాత కల్కినగర్ కాలనీ కష్టాలు మరింత పెరిగాయి. కాలనీలో ఆరు నెలలుగా వీధి లైట్లు రాకపోయినా పట్టించుకున్న నాథుడే లేరని కాలనీవాసులు పేర్కొంటున్నారు. కాలనీలో వీధి దీపాలు వెలగక దాదాపు మూడు నెలలు గడుస్తున్నా మున్సిపల్ సిబ్బంది అటు వైపు కన్నెత్తి చూసిన దాఖలాలు లేవు. వార్డులో వీధి దీపాల సమస్య ఉందని పలుమార్లు అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని, మున్సిపల్‌లో వీధిలైట్లు లేవని చెబుతున్నారని కాలనీవాసులు వాపోతున్నారు. రాత్రి సమయంలో బయటకు వెళ్లాలంటే ప్రజలు భయపడుతున్నారు. రోడ్ల పక్కన చెత్తాచెదారం, డ్రైనేజీలు అపరిశుభ్రంగా ఉండటంతో రోడ్లపైకి రాత్రి సమయంలో పాములు వస్తున్నాయని కాలనీ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికై నా మున్సిపల్ అధికారులు దృష్టి సారించి వీధి దీపాల సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.
కల్కినగర్‌లో అంధకారం...
నిత్యం అవస్థలు పడుతున్న ప్రజలు
మున్సిపల్‌లో వీధి దీపాలు లేవని
సమాధానం ఇస్తున్న సిబ్బంది
పలుమార్లు విన్నవించినా
పట్టించుకోని మున్సిపల్ అధికారులు


